Tamilnadu: దొంగను పట్టుకోవడానికి వెళితే.. దొంగలంటూ కట్టిపడేశారు: తమిళనాడులో ఏపీ పోలీసులకు వింత అనుభవం!

  • గజదొంగ రామకృష్ణన్‌ను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులు
  • అరెస్ట్ చేసి తీసుకొస్తుండగా గ్రామస్తుల దాడి
  • చల్లగా తప్పించుకున్న రామకృష్ణన్‌

దొంగలు, దోపిడీ ముఠాల నాయకులను పట్టుకునేందుకు పోలీసులు చేపట్టే ఆపరేషన్లు అంత సజావుగా సాగవు. చాలాసార్లు పోలీస్ అధికారుల నుంచి దొంగలు తప్పించుకోవడమో, మరికొన్ని సార్లు ఎదురుదాడి చేసి పారిపోవడమో జరుగుతూ ఉంటుంది. ఇంకొన్ని సార్లు మాత్రం వారిని అధికారులు చాకచక్యంగా పట్టుకుంటారు. కానీ తమిళనాడులో మాత్రం పూర్తి విభిన్న ఘటన చోటుచేసుకుంది. ఓ గజ దొంగను మఫ్టీలో ఉన్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు పట్టుకోగా, వీరందరినీ దొంగలుగా అనుమానించిన స్థానికులు తాళ్లతో కట్టి ఓ గదిలో పడేశారు. స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని వీరిని విడిపించేలోపే అసలు దొంగ చల్లగా పారిపోయాడు.

తమిళనాడులోని ఇలవన్‌తోపు ప్రాంతానికి చెందిన రామకృష్ణన్‌ (30)పై ఏపీలోని అనంతపురం జిల్లాలో 40కిపైగా దోపిడీ కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రామకృష్ణన్‌ ఇలవన్ తోపు ప్రాంతంలోనే తలదాచుకున్నట్లు తెలిసింది. దీంతో ఎస్‌ఐ సిరిహర్ష నేతృత్వంలో ఐదుగురు పోలీసులు మఫ్టీలో సోమవారం రాత్రి అక్కడకు చేరుకున్నారు. రామకృష్ణన్‌ను పట్టుకుని తిరుగుప్రయాణం అయ్యారు.

అయితే వీరిని రాత్రిపూట చూసిన గ్రామస్తులు దొంగలుగా అనుమానించి దాడికి దిగారు. తాము పోలీసులమని చెబుతున్నా వినకుండా తాళ్లతో కట్టేసి ఓ గదిలో పడేశారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు వీరిని విడిపించారు. అయితే ఈ గొడవ జరుగుతున్న క్రమంలో రామకృష్ణన్‌ అక్కడి నుంచి చల్లగా జారుకున్నాడు. దీంతో పోలీస్ అధికారులు తలలు పట్టుకున్నారు. మళ్లీ వేట మొదలుపెట్టిన పోలీసులు నిన్న మరోసారి రామకృష్ణన్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం రిమాండ్ కు తరలించారు.

More Telugu News