britain: బ్రిటన్ పార్లమెంటులోనూ లైంగిక వేధింపులు.. మహిళా ఉద్యోగులపై ఎంపీల సెక్స్ జోకులు!

  • చాలాకాలంగా కొనసాగుతున్న దారుణం
  • హౌస్ ఆఫ్ కామన్స్ విచారణలో బట్టబయలు
  • ఫిర్యాదు చేసేందుకు కనీసయంత్రాంగం లేదని మండిపాటు

ప్రపంచవ్యాప్తంగా సినిమా, మీడియా, రాజకీయ రంగాల్లో ‘మీ టూ’ ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. పని ప్రదేశాల్లోనే కాదు.. ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లుగా భావించే బ్రిటన్ పార్లమెంటులో కూడా మహిళలకు వేధింపులు తప్పడం లేదని తేలింది.

బ్రిటన్ పార్లమెంటులోని హౌస్ ఆఫ్ కామన్స్ (దిగువ సభ)లో లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో నేత ఆండ్రియా లీడ్సమ్ విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో మాజీ జడ్జీ డేమ్ లారా కాక్స్ జరిపిన విచారణలో సంచలనాత్మక విషయాలు బయటకొచ్చాయి. దాదాపు 200 మంది మహిళా ఉద్యోగులపై ప్రస్తుత, మాజీ ఎంపీలు వేధింపులకు పాల్పడ్డారని తేలింది.

లైంగిక వేధింపులు, బెదిరించడం, విసిగించడం, శరీరం రూపురేఖలపై కామెంట్లు, అవమానించడం, బలవంతంగా ముద్దు పెట్టుకునేందుకు యత్నించడం, సెక్స్ జోకులు వేయడం, అసభ్యంగా తాకడం వంటి ఆరోపణలు వచ్చాయన్నారు. చాలామంది సభ్యుల చెడు ప్రవర్తనను పార్లమెంటులో దాచి ఉంచే ప్రయత్నం జరిగిందని లారా తన నివేదకలో వెల్లడించారు. కేవలం చట్ట సభ్యులే కాకుండా సీనియర్ ఉద్యోగులు కూడా మహిళా సిబ్బందిని వేధింపులకు గురి చేశారన్నారు.

మహిళా ఉద్యోగుల ఫిర్యాదులపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి నిజానిజాలను తేల్చే యంత్రాంగం బ్రిటన్ పార్లమెంటులో కరవయిందని తెలిపారు. నిబంధనల మేరకు లైంగిక వేధింపులకు పాల్పడ్డ చట్టసభ్యుల పేర్లను బయటపెట్టలేక పోతున్నామని పేర్కొన్నారు. కొందరు అధికారులు తప్పుకునేవరకూ తమకు వేధింపులు కొనసాగుతూనే ఉంటాయన్న భయంలో బాధితులు ఉన్నారని తెలిపారు. ఈ మేరకు 155 పేజీల నివేదికను లారా సభకు సమర్పించారు.

More Telugu News