BJP: దమ్ములేని నేతలు జగన్, పవన్: దేవినేని ఉమ

  • అన్యాయం చేస్తున్న బీజేపీని ప్రశ్నించడం లేదెందుకు?
  • ఎన్నికల్లో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదు
  • పోలవరం ప్రాజెక్టును వైసీపీ అడ్డుకుంటోంది
  • ఏపీ మంత్రి దేవినేని ఉమ విమర్శలు

వైకాపా అధినేత వైఎస్ జగన్ కు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము లేదని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నిప్పులు చెరిగారు. ఈ ఉదయం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్న బీజేపీని వీరిద్దరూ ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఇప్పుడున్న ప్రతిపక్ష హోదా కూడా దక్కదని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వైసీపీ కావాలనే అడ్డుకుంటోందని, ఈ ప్రాజెక్టు పూర్తయితే, తమకు పుట్టగతులు ఉండవన్నది ఆ పార్టీ దిగులని అన్నారు.

పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సీఎం చంద్రబాబు చిత్తశుద్ధితో ఉన్నారని, ప్రతి వారమూ పనుల పురోగతిని పరిశీలిస్తున్నారని దేవినేని చెప్పారు. ఇప్పటికే 46.93 శాతం హెడ్ వర్క్స్ పనులు పూర్తయ్యాయని, సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టును పూర్తి చేసి చూపిస్తామని చెప్పారు. డిసెంబర్ నాటికి నిర్వాసితులకు ప్యాకేజీ, పునరావాసం పూర్తవుతాయని చెప్పారు. పోలవరం అంచనాలు పెంచి, తాను అవినీతికి పాల్పడినట్టు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని దేవినేని వ్యాఖ్యానించారు. అవినీతికి పాల్పడినది ఎవరో సీబీఐ, ఈడీలకు తెలుసునని అన్నారు.

More Telugu News