Sabarimala: రేపే శబరిమలకు వస్తున్నా... నా రక్షణ ప్రభుత్వానిదే: తృప్తీ దేశాయ్

  • బుధవారం అయ్యప్ప దర్శనానికి వెళుతున్నా
  • కోర్టు తీర్పులను ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందే
  • నిరసనల గురించి పట్టించుకోబోనన్న తృప్తీ దేశాయ్

మహిళలకు ప్రవేశం లేని ఆలయాల్లో ప్రవేశం కోరుతూ, సుప్రీంకోర్టు నుంచి అనుమతులు తెచ్చుకుని, పోలీసుల సాయంతో ఆలయాల్లోకి వెళ్లి పూజలు చేసి వస్తున్న హక్కుల కార్యకర్త తృప్తీ దేశాయ్, రేపు శబరిమలకు వస్తున్నట్టు సంచలన ప్రకటన చేశారు.

సుప్రీంకోర్టు ఆదేశాలను అందరూ గౌరవించాలని, తాను అయ్యప్ప దర్శనం కోసం శబరిమలకు బుధవారం నాడు వెళుతున్నానని ఆమె తెలిపారు. తన రక్షణ బాద్యత కేరళ ప్రభుత్వం, పోలీసులదేనని చెప్పారు. కేరళలో జరుగుతున్న నిరసనల గురించి తాను పట్టించుకోబోనని, ఓ వర్గం వారు చేస్తున్న నిరసనలు కోర్టు తీర్పులను అడ్డుకోలేవని ఆమె అన్నారు.

కాగా, తృప్తీ దేశాయ్ చేసిన ప్రకటన గురించి తెలుసుకున్న కేరళ సంఘాలు మరింతగా మండిపడుతున్నాయి. అమెను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలయం వద్దకు వెళ్లనివ్వబోమని పలువురు మహిళలు వ్యాఖ్యానించారు. ఆమెను అడ్డుకునేందుకు ఆత్మహత్య కూడా చేసుకుంటామని హెచ్చరించారు. ఆమె ఎక్కడ కాలుపెడితే, అక్కడ అడ్డుకుంటామని, కేరళ మహిళల మనోభావాలను దెబ్బతీయకుండా వెనక్కు వెళ్లిపోవాలని కోరతామని చెప్పారు. వినకుంటే తరువాతి పరిణామాలను ఆమె ఎదుర్కోవాల్సిందేనని హెచ్చరించారు.

More Telugu News