MJ Akbar: కేంద్ర మంత్రి అక్బర్‌ తరఫున కేసును వాదించేందుకు 97 మంది న్యాయవాదులు!

  • అక్బర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు
  • పాత్రికేయురాలిపై కేసేసిన మంత్రి
  • ఎదుర్కొంటానన్న ప్రియా రమణి
పాత్రికేయురాలు ప్రియా రమణి తనపై చేసిన లైంగిక ఆరోపణలను ఖండించిన కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ ఆమెపై ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. అక్బర్ తరపున న్యాయవాద ఏజెన్సీ 'కరంజ్వాలా అండ్ కో' ఈ కేసు వేసింది. అక్బర్ తరపున ఈ కేసును వాదించేందుకు ఏకంగా 97 మంది న్యాయవాదులు సిద్ధమయ్యారు. కోర్టుకు సమర్పించిన వకాల్తానామాలో ఈ మేరకు 97 మంది పేర్లను చేర్చారు.

అయితే, ప్రస్తుతానికి ఆరుగురు లాయర్లు మాత్రమే కేసును వాదిస్తారు. ఏవైనా కారణాల వల్ల వారు కనుక హాజరుకాలేకపోతే అప్పుడు మిగతావారు రంగంలోకి దిగుతారు. ప్రస్తుతం ఈ కేసును సందీప్ కుమార్, ప్రిన్సిపల్ అసోసియేట్ వీర్ సాధు, సీనియర్ అసోసియేట్స్ నిహారిక కరంజ్వాలా, అపూర్వ పాండే, మయాంక్ దత్తా, అసోసియేట్‌ గుడిపాటి జి.కశ్యప్‌‌లు వాదిస్తారని కరంజ్వాలా అండ్ కో తెలిపింది.

తనపై అక్బర్ వేసిన కేసుపై బాధిత పాత్రికేయురాలు ప్రియా రమణి స్పందించారు. కేసును ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, సత్యం తన వెంట ఉంటుందని, అదే తనకు రక్షణ అని పేర్కొన్నారు.
MJ Akbar
Me too
Minister
priya Ramani
lawyer
court

More Telugu News