Nalgonda District: అమృత వర్షిణికి సాయుధ భద్రత కల్పించిన పోలీసులు!

  • నిన్న అమృత ఇంటికి వచ్చిన జంట
  • ప్రణయ్ ఆత్మ మాట్లాడుతుందంటూ బురిడీ
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన ప్రణయ్ ఇంటికి, అమృతకు పోలీసులు సాయుధ భద్రతను కల్పించారు. ఇటీవల చంపేస్తామని ఫేస్ బుక్ లో కొందరు యువకులు అమృతను బెదిరించడం, నిన్న ఓ జంట వీరి ఇంటికి వచ్చి ప్రణయ్ ఆత్మ తమతో మాట్లాడుతోందని చెప్పడంతో అమృత భయాందోళనలకు లోనయింది. ఈ నేపథ్యంలో తనతో పాటు తన అత్తమామల ప్రాణానికి ప్రమాదముందని, తమకు భద్రత కల్పించాలని మరోసారి పోలీసులకు విజ్ఞప్తి చేసింది.

ఈ నేపథ్యంలో ప్రణయ్ ఇంటికి సాయుధ పోలీసులతో గట్టి భద్రతను కల్పించారు. నిన్న అమృతను కలుసుకున్న ఓ జంట.. ప్రణయ్ ఆత్మ తమతో మాట్లాడుతోందని చెప్పిన సంగతి తెలిసిందే. గత జన్మలో ఉన్న పగ కారణంగానే మామ మారుతీరావు తనను హత్య చేయించినట్లు ప్రణయ్ ఆత్మ తమకు వెల్లడించినట్లు వాళ్లు అమృతకు చెప్పారు. మిర్యాలగూడలో విగ్రహాన్ని ఏర్పాటు చేయొద్దనీ, ఒకవేళ ఏర్పాటు చేస్తే తన ఆత్మ అందులోకి వెళ్లిపోతుందని ప్రణయ్ చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ మాటలు విన్న అమృత పోలీసులకు సమాచారం అందించడంతో వారు సదరు జంటను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Nalgonda District
miryalaguda
amrutha
pranay
honour killing
Police

More Telugu News