Hillary Clinton: నా భర్తతో అఫైర్ ఉన్న సమయానికి మోనికా వయసు 22 ఏళ్లు: హిల్లరీ క్లింటన్

  • మోనికాతో బిల్ క్లింటన్ కు అఫైర్
  • అప్పటికే మోనికా వయోజనురాలన్న హిల్లరీ
  • అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కు, అప్పట్లో వైట్ హౌస్ ఉద్యోగి మోనికా లూయిన్ స్కీకి మధ్య ఉన్న అఫైర్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనాన్ని రేకెత్తించిన సంగతి తెలిసిందే. తాజాగా మీటూ ఉద్యమం నేపథ్యంలో ఆ అఫైర్ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో తన భర్తను హిల్లరీ క్లింటన్ వెనకేసుకొచ్చింది. ఆ అఫైర్ కు, అధికార దుర్వినియోగానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. ఈ స్కాండల్ నేపథ్యంలో అప్పట్లో అధ్యక్ష పదవికి తన భర్త రాజీనామా చేయాల్సిన అవసరం లేదని చెప్పారు.

మోనికాతో తన అఫైర్ కు సంబంధించి అబద్ధాలను చెప్పిన బిల్ క్లింటన్ అప్పట్లోనే తన పదవి నుంచి దిగిపోతే బాగుండేదని న్యూయార్క్ సెనేటర్ గిల్లిబ్రాండ్ తాజాగా వ్యాఖ్యానించారు. దీనిపై హిల్లరీ స్పందిస్తూ... అంత అవసరంలేదని చెప్పారు. ఆ ఘటన జరిగిన సమయంలో మోనికా వయసు 22 ఏళ్లని... అప్పటికే ఆమె వయోజనురాలు (అడల్ట్) అని చెప్పారు.

మోనికాతో అఫైర్ వెలుగు చూసిన తర్వాత 1999లో ఆయనను పదవి నుంచి తొలగించేందుకు దాదాపు నెల రోజుల పాటు సెనేట్ ట్రయల్ నిర్వహించింది. ఆయనను తొలగించడానికి సెనేట్ లో మూడింట రెండొంతుల మెజార్టీ రావాలి. అయితే, కావాల్సినంత మెజార్టీకి కొంచెం తక్కువ రావడంతో బిల్ క్లింటన్ గట్టెక్కారు. మరోవైపు, ఈ అఫైర్ ఇద్దరి ఇష్టంతోనే కొనసాగిందని ఇంతకాలం మోనికా చెబుతూ వచ్చింది. అయితే, తన అభిప్రాయాన్ని మార్చుకోవాలని అనుకుంటున్నట్టు ఈ ఏడాది ప్రారంభంలో ఆమె తెలిపింది. 
Hillary Clinton
bill clinton
monica lewinsky
metoo

More Telugu News