TRS: కాంగ్రెస్ తో రహస్య చర్చలు.. ఎమ్మెల్సీ రాములు నాయక్ ను సస్పెండ్ చేసిన టీఆర్ఎస్!

  • నిన్న కాంగ్రెస్ నేతలతో నాయక్ భేటీ
  • ఇల్లందు సీటుపై హామీ ఇచ్చిన కాంగ్రెస్
  • మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం

తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ రాములు నాయక్ పై పార్టీ అధిష్ఠానం సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకే రాములు నాయక్ ను సాగనంపినట్లు తెలుస్తోంది. నిన్న టీ-పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ పార్టీ ఇన్ చార్జ్ కుంతియాతో పాటు మరికొందరు నేతలతో రాములు నాయక్ రహస్యంగా భేటీ అయ్యారు. పార్టీలో చేరితే నారాయణ ఖేడ్ టికెట్ ఇస్తారా? అన్న విషయమై చర్చించారు. ఈ విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ అధిష్ఠానం రాములు నాయక్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడినందుకు నాయక్ ను సస్పెండ్ చేసినట్లు టీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ రోజు తెలిపారు.

టీఆర్ఎస్ పార్టీ నుంచి నారాయణ ఖేడ్ టికెట్ ను రాములు నాయక్ ఆశించారు. అయితే ఈ టికెట్ ను సీఎం కేసీఆర్ ఎం.భూపాల్ రెడ్డికి అప్పగించారు. ఈ నేపథ్యంలో రాములు నాయక్ నిన్న కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. కాగా, కాంగ్రెస్ లో చేరితే అసెంబ్లీ  టికెట్ ఇస్తామని తెలంగాణ ఏఐసీసీ ఇన్ చార్జ్ కుంతియా హామీ ఇచ్చినట్లు సమాచారం.

కాగా, వేటు నేపథ్యంలో మరికాసేపట్లో రాములు నాయక్ మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ నెల 20న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ తెలంగాణ పర్యటన సందర్భంగా ఆయన సమక్షంలో రాములు నాయక్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశముందని భావిస్తున్నారు.

More Telugu News