India: నెలరోజుల్లో రూ. 4,500 పెరిగిన బంగారం ధర... మరింత పైకేనంటున్న నిపుణులు!

  • నెల రోజుల క్రితం రూ. 28 వేలుగా ఉన్న 10 గ్రాముల బంగారం ధర
  • ఇప్పుడు రూ. 32,600కు చేరిక
  • ప్రభావం చూపుతున్న రూపాయి విలువ, క్రూడాయిల్

బంగారం ధర నిజంగానే చుక్కలనంటేలా ఎగబాకుతోంది. సరిగ్గా నెల రోజుల క్రితం రూ. 28 వేలుగా ఉన్న పది గ్రాముల బంగారం ధర, ఇప్పుడు రూ. 32,670గా ఉంది. అంటే 4,600 రూపాయలకు పైగా ధర పెరిగినట్టు. ఇదే వేగం కొనసాగితే, ఒకటి, రెండు రోజుల్లోనే బంగారం ధర రూ. 33 వేలకు చేరుతుందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ధరలు ఇంతగా పెరగడంతో బంగారం అమ్మకాలు క్షీణించాయి. ఈ పండగ సీజన్ లో ఆశించినంతగా ఆభరణాల విక్రయం సాగడం లేదని వ్యాపారులు వాపోతున్న పరిస్థితి.

గడచిన మూడు సంవత్సరాల్లో రూ. 31,500 నుంచి రూ. 32 వేల మధ్య కొనసాగిన బంగారం ధర, క్రూడాయిల్ ధల పెరుగుదల, యూఎస్, చైనాల మధ్య వాణిజ్యయుద్ధం కారణంగా దారుణంగా పడిపోయి రూ. 28 వేలకు చేరింది. మరింతగా బంగారం ధరలు పడిపోతాయన్న అంచనాలూ వచ్చాయి. అయితే, వాటిని తల్లకిందులు చేస్తూ ధరల పెరుగుదల ప్రారంభమైంది.

రూపాయి విలువ పడిపోవడం, డాలర్ కు ఏర్పడిన డిమాండ్, ముడి చమురు ధరల పతనంతో అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు స్థాయికి బంగారం ధర పెరిగింది. గడచిన గురువారం నాడు రూ. 33,200కు ఎగసిన బంగారం ధర, ఆపై కాస్తంత కిందకు దిగివచ్చింది. డాలర్ తో రూపాయి మారకపు విలువ రూ. 74 స్థాయి నుంచి తగ్గడం కూడా బంగారం ధరపై కొంతమేరకు ప్రభావం చూపించిందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేశారు.

More Telugu News