USA: నువ్వు అసలు హిందువువేనా? మా గుడిలోకి రావొద్దు!: అమెరికాలో ఇండో అమెరికన్ శాస్త్రవేత్తకు తీవ్ర అవమానం!

  • అమెరికాలోని అట్లాంటాలో ఘటన
  • గార్భా డ్యాన్స్ కోసం ఆలయానికి చేరుకన్న కరణ్
  • పేరు హిందువులా లేదని అడ్డుకున్న సిబ్బంది

అమెరికాలో ఉన్న ప్రఖ్యాత భారత సంతతి శాస్త్రవేత్త డా.కరణ్ జానీ(29)కి తీవ్ర అవమానం ఎదురైంది. అతని పేరు హిందువు పేరులా లేదని చెబుతూ సంప్రదాయ గుజరాతీ డ్యాన్స్ ‘గార్భా’ చేసేందుకు ఆలయంలోకి అక్కడి సిబ్బంది అనుమతించలేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన కరణ్ ఆలయ నిర్వాహకుల వ్యవహారశైలిని నిరసిస్తూ సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశాడు.

2016లో అమెరికా, యూరప్ శాస్త్రవేత్తలు విశ్వంలో గురుత్వాకర్షణ తరంగాలను కనుగొన్నారు. ఈ శాస్త్రవేత్తల బృందం 'లెగో టీమ్'లో కరణ్ సభ్యుడిగా ఉన్నాడు. గుజరాత్ కు చెందిన ఆయన గత 12 ఏళ్లుగా అమెరికాలో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో గత శుక్రవారం సంప్రదాయ గార్భా డ్యాన్స్ చేసేందుకు కరణ్ తన స్నేహితులతో కలిసి అట్లాంటాలోని శక్తి మందిర్ కు చేరుకున్నారు.

అయితే అక్కడి సిబ్బంది మాత్రం వీరిని అడ్డుకున్నారు. పేరు వెనుక జానీ అని ఉండటంతో ‘మీరు అసలు హిందువులేనా?’ ‘మీ పేరు హిందువులా అనిపించడం లేదు’ ‘మీ వేడుకలకు మేం రాము. మా వేడుకలకు మీరెందుకు వస్తున్నారు? మీరు హిందువులు కాదు. ఇస్మాయిలీలు’ అని కరణ్ స్నేహితులను కూడా అవమానించారు.

తాను గత ఆరేళ్లుగా గార్భా కోసం ఇక్కడకు వస్తున్నాననీ కరణ్ చెప్పినా వినిపించుకోలేదు. చివరికి కన్నీటితో కరణ్, అతని స్నేహితులు అక్కడి నుంచి వెనుదిరిగారు. తమకు జరిగిన ఈ అవమానంపై ఫేస్ బుక్, ట్విట్టర్ లో కరణ్ వీడియోలను పోస్ట్ చేశాడు. కాగా, ఈ అంశం వివాదాస్పదంగా మారడంతో శక్తి మందిర్ యాజమాన్యం స్పందించింది. జరిగినదానికి తాము చింతిస్తున్నామనీ, కొందరు సిబ్బంది పొరపాటు కారణంగా ఈ ఘటన చోటుచేసుకుందని వివరణ ఇచ్చింది.

  • Loading...

More Telugu News