Pranay: ప్రణయ్ ఆత్మతో మాట్లాడిస్తామంటూ అమృతకు బంపరాఫర్.. పోలీసులకు ఫిర్యాదు!

  • ప్రణయ్-మారుతీరావు గత జన్మలో శత్రువులు
  • వచ్చే జన్మలోనూ అమృతతోనే జీవించాలనుకుంటున్నట్టు చెప్పిన ప్రణయ్ ఆత్మ
  • అమృత ఇంటి చుట్టూ ప్రణయ్ ఆత్మ చక్కర్లు
వేరే కులం వ్యక్తిని ప్రేమించిన పాపానికి కన్నతండ్రి చేతిలోనే భర్తను కోల్పోయిన నల్గొండ జిల్లాకు చెందిన అమృతకు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చెందిన దంపతులు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ప్రణయ్ ఆత్మ తమతో మాట్లాడుతోందని, నువ్వు ఊ అంటే నీతో మాట్లాడిస్తామంటూ అమృతను నమ్మించే ప్రయత్నం చేశారు. వారి తీరుపై అనుమానంతో అమృత పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పొత్తూరు నాగారావు-సత్యప్రియ దంపతులు ప్రణయ్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఆదివారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ వచ్చారు. అమృతతో ముఖ్యమైన విషయం మాట్లాడాలంటూ ఆమెను పిలిపించుకున్నారు. కుశల ప్రశ్నల అనంతరం.. ప్రణయ్ ఆత్మ తమతో  మాట్లాడుతోందని, నీ కోసం ఘోషిస్తోందని చెప్పారు. అది మీ ఇంటి చుట్టూనే చక్కర్లు కొడుతోందని, వచ్చే జన్మలోనూ ప్రణయ్ నీతోనే జీవించాలనుకుంటున్నాడని అమృతతో చెప్పారు. అంతేకాదు.. నువ్వు ఓకే అంటే నీతో మాట్లాడిస్తామంటూ ఆఫర్ కూడా ఇచ్చారు. అమృత తండ్రి మారుతీరావు, హత్యకు గురైన ప్రణయ్ ఇద్దరూ గత జన్మలో శత్రువులని, ఈ జన్మలో ఇలా ప్రణయ్‌పై మారుతీరావు పగతీర్చుకున్నాడంటూ చక్కని కథ చెప్పుకొచ్చారు.

గత జన్మలో పగనే మారుతీరావు తీర్చుకున్నాడని, నిజానికి ఈ జన్మలో అతడితో ఎటువంటి పగలేదని చెప్పుకొచ్చారు. ప్రణయ్ విగ్రహాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ పెట్టవద్దని, ఒకవేళ అదే కనుక జరిగితే ప్రణయ్ ఆత్మ అందులో ఉండిపోతుందని వివరించి చెప్పారు. వారు చెప్పిన మాటలన్నీ విన్న అమృత అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు ఆ దంపతులను అదుపులోకి తీసుకున్నారు. అసలు వారు అమృత ఇంటికి ఏ ఉద్దేశంతో వచ్చారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Pranay
Amrutha
Nalgonda District
Miryalaguda
soul

More Telugu News