MJAkbar: నాపై ఆరోపణలన్నీ అసూయతో సృష్టించిన అవాస్తవాలు!: ఎం.జె.అక్బర్‌

  • విదేశీ పర్యటనలో ఉండడం వల్లే నేను స్పందించ లేదు
  • సార్వత్రిక ఎన్నికల ముందే ఇటువంటి విమర్శలు ఎందుకొచ్చినట్టు?
  • న్యాయపరంగానే వీటిని ఎదుర్కొంటాను

కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎం.జె.అక్బర్‌ ఎట్టకేలకు నోరు విప్పారు. లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ గత కొంతకాలంగా తనపై వస్తున్న ఆరోపణల విషయంలో ఒక్కదానికీ వివరణ ఇవ్వని ఆయన స్పందించారు.

 ‘నాపై ఆరోపణలన్నీ అసూయతో కావాలని సృష్టించిన నిరాధార ఆరోపణలు, అవాస్తవాలు’ అని ఓ ప్రకటన విడుదల చేశారు. విమానాశ్రయంలో అక్బర్‌ను చుట్టుముట్టి విలేకరులు ప్రశ్నల వర్షం కురిపించినా ‘ఈ అంశాలపై తర్వాత మాట్లాడతాను’ అని చెప్పి వెళ్లిపోయిన అక్బర్‌ తర్వాత ఈ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. 'సార్వత్రిక ఎన్నికల ముందే ఇటువంటి ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? దీని వెనుక ఉన్న ఎజెండా ఏమిటి? అన్న దానిపై నిర్ణయాన్ని మీకే వదిలేస్తున్నా'నని స్పష్టం  చేశారు.

విదేశీ పర్యటనలో ఉన్నందునే ఇన్నాళ్లు తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించ లేదని, ఇకపై న్యాయపరంగా వీటిని ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. ‘నేను స్విమ్మింగ్‌పూల్‌లో పార్టీ చేసుకుంటానని ఒకరు ఆరోపించారు. వాస్తవానికి నాకు ఈత రాదు. నా పరువు ప్రతిష్టలను దెబ్బతీసేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు’ అని తెలిపారు. ఎలాంటి ఆధారంలేని ఆరోపణలు వైరల్‌గా మారుతున్నాయని, వీటిపై తన భవిష్యత్తు కార్యాచరణ ఏమిటన్నది తన లాయర్లు నిర్ణయిస్తారని స్పష్టం చేశారు.

మరోవైపు అక్బర్‌ తన పదవికి రాజీనామా చేశారని వచ్చిన వార్తలపై ఆయన ఎటువంటి ప్రకటన చేయలేదు. అక్బర్‌ పదవి నుంచి తప్పుకోవడం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నట్లు సమాచారం.

More Telugu News