లక్ష రూపాయలు కూడా చూడని ఆటోడ్రైవర్ అకౌంట్ లో కోట్ల లావాదేవీలు!

14-10-2018 Sun 19:51
  • కరాచీ పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ మహమ్మద్
  • అతని అకౌంట్  ద్వారా మూడొందల కోట్ల లావాదేవీలు
  • ఆశ్చర్యపోయిన ఆటోడ్రైవర్
తన బ్యాంకు అకౌంట్ నుంచి రూ.300 కోట్ల లావాదేవీలు జరగడంపై పాకిస్థాన్ కు చెందిన ఓ ఆటోడ్రైవర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. పాకిస్థాన్ దర్యాప్తు సంస్థ నుంచి అతనికి ఫోన్ కాల్ వచ్చే వరకూ ఈ విషయం అతనికి తెలియదు. కరాచీ పట్టణానికి చెందిన మహమ్మద్ రషీద్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు. అతని బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.300 కోట్ల లావాదేవీలు జరిగినట్టు ఫెడరల్ దర్యాప్తు సంస్థ (ఎఫ్ఐఏ) అధికారులు రషీద్ కు ఫోన్ చేశారు.

ఈ విషయమై అధికారులు అతన్ని ప్రశ్నించారు. ఇన్ని కోట్ల రూపాయల లావాదేవీలు ఎలా జరిగాయో తనకు తెలియదని అధికారులకు చెప్పాడు. అధికారుల విచారణ అనంతరం, మీడియాతో రషీద్ మాట్లాడుతూ, విచారణ నిమిత్తం అధికారులు తనను పిలవగానే భయపడిపోయానని, తన అకౌంట్ వివరాలు చూపిస్తూ ఇన్ని కోట్ల లావాదేవీలు జరిగాయని చెప్పడంతో ఆశ్చర్యపోయానని చెప్పాడు.

అసలు తన జీవితంలో ఇంత వరకూ ఒక లక్ష రూపాయలు కూడా చూడలేదని, అలాంటిది మూడొందల కోట్ల రూపాయల లావాదేవీలు తన అకౌంట్ ద్వారా జరిగాయంటే నోట మాట రావడం లేదని చెప్పాడు. ఇప్పటికీ, అద్దె ఇంట్లోనే తాను ఉంటున్నానని, తన అకౌంట్ ను ఎవరో ఉపయోగించుకుంటున్నారన్న అనుమానాన్ని వ్యక్తం చేశాడు. 2005లో ఓ ప్రైవేట్ కంపెనీలో కొన్ని నెలలు పని చేసి మానేశానని, ఆ సమయంలో తన పేరిట బ్యాంకు ఖాతా తెరిచిన విషయాన్ని అధికారులకు చెప్పానని రషీద్ చెప్పుకొచ్చాడు.