దర్శకుడు సుభాష్ ఘాయ్ పై నటి, మోడల్ కేట్ శర్మ లైంగిక ఆరోపణలు

14-10-2018 Sun 15:31
  • సుభాష్ ఘాయ్ తన ఇంటికి పిలిస్తే వెళ్లా
  • తనకు మసాజ్ చేయమని అడిగితే ఆశ్చర్యపోయాను
  • ఓ రాత్రి తనతో గడపమని అడిగారు: కేట్ శర్మ

బాలీవుడ్ దర్శకుడు సుభాష్ ఘాయ్ పై ప్రముఖ నటి, మోడల్ కేట్ శర్మ లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఆయన తనను బలవంతంగా ముద్దుపెట్టుకోవడానికి, కౌగిలించుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించింది.ఈ ఆరోపణలు చేస్తూ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆగస్టు 6వ తేదీన సుభాష్ ఘాయ్ తనను వాళ్లింటికి పిలిస్తే వెళ్లానని, ఆ ఇంట్లో ఆరుగురికి పైగా ఉన్నారని, వాళ్లందరి ముందే ఆయనకు మసాజ్ చేయమని తనని అడగడంతో షాక్ అయ్యానని మీడియాతో చెప్పింది. అయినప్పటికీ, ఆయనపై గౌరవంతో మూడు నిమిషాల పాటు ఆయనకు మసాజ్ చేశానని, ఆ తర్వాత చేతులు కడుక్కునేందుకు బాత్రూమ్ కు తాను వెళ్లగా, వెంటే ఆయన కూడా వచ్చారని, ఏదో మాట్లాడాలని చెప్పిన ఆయన గదిలోకి తీసుకెళ్లారని ఆరోపించింది. ఆ తర్వాత తనను దగ్గరకు లాక్కొని కౌగిలించుకోబోయారని, ముద్దుపెట్టుకునేందుకు యత్నించారని ఆరోపించింది. ఓ రాత్రి తనతో గడపకపోతే తనను నటిగా పరిచయం చేయనని సుభాష్ ఘాయ్ బెదిరించారని తీవ్ర ఆరోపణలు చేసింది.