CM Ramesh: ఏ సమాచారంతో ఐటీ అధికారులు తనిఖీలు చేశారో లీగల్ గా ప్రశ్నిస్తా: సీఎం రమేశ్

  • నేనేమైనా పాకిస్థాన్ తో సంబంధాలు పెట్టుకున్నానా?
  • నా వద్ద ఏమైనా రక్షణ ఆయుధాల సమాచారం ఉందా?
  • నేను, మా బంధువులు క్రమం తప్పకుండా రిటర్న్స్ దాఖలు చేస్తాం

ఏ సమాచారంతో తమ నివాసాల్లో, కార్యాలయాల్లో తనిఖీలు చేశారో లీగల్ గా వెళ్లి ప్రశ్నిస్తానని ఏపీ టీడీపీ నేత సీఎం రమేశ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘నేనేమైనా పాకిస్థాన్ తో సంబంధాలు పెట్టుకున్నానా? నా వద్ద ఏమైనా రక్షణ ఆయుధాలకు సంబంధించిన సమాచారం ఉందా?’ అని ప్రశ్నించారు.

బ్యాంక్ ఖాతాల పత్రాలు మాత్రమే దొరికితే కీలక పత్రాలు దొరికాయంటూ కొన్ని ఛానెళ్లు దుష్ప్రచారం చేశాయని మండిపడ్డారు. ప్రచారం చేయడం తగదని అన్నారు. మా బంధువుల ఇంట్లో మాత్రమే రూ.3.50 లక్షలు ఐటీ అధికారులకు లభించాయని, తాను, తన బంధువులు క్రమం తప్పకుండా ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్నామని స్పష్టం చేశారు. పదేళ్ల క్రితం మూసేసిన కార్యాలయానికి కూడా వెళ్లి అధికారులు తనిఖీలు చేశారని చెప్పారు.

 రిత్విక్ ఆగ్రో ఫామ్స్ లో తన భార్య డైరెక్టర్ కాదని, 1998లోనే ‘రిత్విక్’రూ.90 కోట్లు కలిగిన పెద్ద కంపెనీ అని అన్నారు. ఏపీ ప్రభుత్వం తమ కంపెనీకి నామినేషన్ పద్ధతిలోనే పనులు ఇచ్చిందంటూ వచ్చిన విమర్శల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. టెండర్ల పద్ధతిలో కాకుండా నామినేషన్ పద్ధతిలో పనులు ఇచ్చే విధానం ఎక్కడా లేదని, రూ.5 లక్షలు మించిన పనులు నామినేషన్ పద్ధతిలో ఇచ్చే అధికారం ఏ ప్రభుత్వానికీ లేదని స్పష్టం చేశారు.

More Telugu News