Chandrababu: ఎంపీ, ఎమ్మెల్యే పదవులే కాదు.. చంద్రబాబు నుంచి కనీసం టీ కూడా ఆశించలేదు!: పవన్ కల్యాణ్

  • రాష్ట్రం కోసమే టీడీపీకి మద్దతు
  • చంద్రబాబు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి
  • ప్రజా సేవ కోసమే సినిమాలను వదులుకున్నా

రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసమే జనసేన పార్టీని స్థాపించానని పవన్ కల్యాణ్ తెలిపారు. రాజకీయాల్లో జవాబుదారీతనం తీసుకురావడమే తమ లక్ష్యమని వెల్లడించారు. ఈ రోజు అమరావతిలో జనసేన పార్టీ ప్రధాన కార్యాలయాన్ని పవన్ ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో నాదెండ్ల మనోహర్ తో కలిసి పలు ప్రశ్నలకు జవాబిచ్చారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పవన్ సునిశిత విమర్శలు చేశారు.

ప్రత్యేక హోదా అన్నది ఆంధ్రుల జీవనాడి అనీ, దానిపై అఖిలపక్ష సమావేశాన్ని ఎందుకు పిలవడం లేదని పవన్ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. అన్ని పక్షాలను కలుపుకుని ఢిల్లీకి వెళదామనీ, ఇందుకోసం చంద్రబాబు ఆల్ పార్టీ మీటింగ్ ను నిర్వహించాలని కోరారు. చంద్రబాబు తన అనుభవాన్ని రాష్ట్ర శ్రేయస్సు, ప్రజల ప్రయోజనాల కోసం వాడాలని సూచించారు.

2014 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీకి మద్దతు ఇచ్చినందుకు ఎంపీ లేదా ఎమ్మెల్యే పదవిని తాను కోరుకోలేదనీ, కనీసం టీ కూడా ఆశించలేదని పవన్ వ్యాఖ్యానించారు. కోట్లాది రూపాయలు అర్జించే సినీ రంగాన్ని వదులుకుని ప్రజాసేవ చేసేందుకు ముందుకు వచ్చానని పవన్ అన్నారు. చంద్రబాబు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తే జనసేన అండగా ఉంటుందని తెలిపారు. 

More Telugu News