Andhra Pradesh: మోదీ గారూ, ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోండి.. కేంద్రానికి లేఖ రాసిన సీఎం చంద్రబాబు!

  • తిత్లీ తుపానుతో రూ.2,800 కోట్ల నష్టం
  • రూ.1,200 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి
  • తీవ్ర విధ్వంసం జరిగిందని వివరణ 

ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దులో తీరందాటిన తిత్లీ తుపాను శ్రీకాకుళం జిల్లాపై పెనుప్రభావం చూపింది. దీని తీవ్రతకు దాదాపు 3 లక్షల ఎకరాల్లో పంటలు నాశనం కాగా, రోడ్లు, భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఈ రోజు లేఖ రాశారు. తిత్లీ బీభత్సం కారణంగా శ్రీకాకుళంలో రూ.2,800 కోట్ల నష్టం ఏర్పడిందని చంద్రబాబు అందులో తెలిపారు. రోడ్లు, ప్రభుత్వ భవనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని వెల్లడించారు. జిల్లాలో 12,000 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయన్నారు.

రాష్ట్రానికి తక్షణ సాయంగా రూ.1,200 కోట్లు విడుదల చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. తిత్లీ దెబ్బకు మౌలిక వసతులు ఛిన్నాభిన్నం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. తుపాను ప్రభావంతో జిల్లాలోని వ్యవసాయ రంగానికి రూ.800 కోట్లు, ఉద్యానవన శాఖకు రూ.1,000 కోట్లు,  విద్యుత్ రంగానికి రూ.500 కోట్లు, రోడ్లు రూ.100 కోట్లు, పంచాయితీరాజ్ శాఖకు మరో రూ.100 కోట్లు, పశుసంవర్ధక శాఖకు రూ.50 కోట్లు, ఇరిగేషన్ శాఖకు మరో వంద కోట్ల నష్టం సంభవించిందని వెల్లడించారు. పెద్ద మనసుతో శ్రీకాకుళం జిల్లాను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

More Telugu News