Telangana: వేరే కులం వ్యక్తిని ప్రేమించినందుకు యువతికి శిక్ష.. నాలుకపై వాత, గుండు గీసి ఊరేగించాలని గ్రామ పెద్దల తీర్మానం

  • జగిత్యాల జిల్లా బీంరెడ్డి గూడెంలో దారుణం
  • యువకుడిపై కేసు పెట్టిన యువతి తల్లిదండ్రులు
  • పెను ప్రమాదం నుంచి యువతిని రక్షించిన పోలీసులు

వేరే కులం వ్యక్తిని ప్రేమించిందన్న కారణంతో గ్రామ పెద్దలు ఓ యువతికి దారుణమైన శిక్ష విధించారు. గ్రామ కట్టుబాట్లు తప్పిందంటూ దారుణంగా ప్రవర్తించారు. పంచాయతీ నిర్వహించి అందరూ కలిసి ఓ తీర్మానం చేశారు. యువతి నాలుకపై బంగారు తీగతతో వాతపెట్టడంతోపాటు గుండు గీసి ఊరేగించాలని తీర్పు చెప్పారు. అంతేకాదు, గ్రామ కట్టుబాట్లు తప్పినందుకు రూ.26 వేల జరిమానా కూడా విధించారు.

జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం బీంరెడ్డి గూడెంలో జరిగిందీ దారుణం. పోలీసులు అప్రమత్తం కావడంతో యువతికి పెను ప్రమాదం తప్పింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన యువతి (18) రేచపల్లికి చెందిన యువకుడు (20) ప్రేమించుకున్నారు. ఆరు నెలల క్రితం విషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని జైలుకు పంపారు. యువతిని ఆమె తల్లిదండ్రులు బంధువుల ఇంట్లో ఉంచారు.

రెండు రోజుల క్రితం యువతి తల్లిదండ్రులు కుమార్తెను గ్రామానికి తీసుకొస్తుండగా కుల పెద్దలు వారిని అడ్డుకున్నారు. శుక్రవారం పంచాయతీ నిర్వహించి కులకట్టుబాట్లు తప్పినందుకు గాను రూ.26 వేల జరిమానా విధించారు. వేరే కులం వ్యక్తిని ప్రేమించినందుకు ఆమె నాలుకపై బంగారు తీగతో వాత పెట్టాలని, మరోసారి ఇటువంటి తప్పు చేయకుండా గుండు గీసి గ్రామంలో ఊరేగించాలని నిర్ణయించారు. సాయంత్రం తీర్పును అమలు చేసేందుకు పెద్దలు రెడీ అవుతుండగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువతిని రక్షించారు. గ్రామ పెద్దలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News