Hyderabad: హైదరాబాద్‌లో హోర్డింగ్ ఎక్కిన వరంగల్ విద్యార్థి.. బీటెక్‌లో డిటెన్షన్ విధానాన్ని సవరించాలని డిమాండ్

  • డీఎంహెచ్‌వో క్యాంపస్ ఆవరణలోని హోర్డింగ్ ఎక్కిన రజనీకాంత్
  • సుల్తాన్ బజార్‌లో కలకలం
  • సర్దిచెప్పి కిందికి దింపిన పోలీసులు

వరంగల్‌లో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి రజనీకాంత్ హైదాబాద్‌లో హల్‌చల్ చేశాడు. బీటెక్‌లో డిటెన్షన్ విధానాన్ని సవరించాలంటూ డీఎంహెచ్‌వో క్యాంపస్ ఆవరణలో ఉన్న హోర్డింగ్ ఎక్కి కలకలం రేపాడు. రెండేళ్ల క్రితం అమల్లోకి వచ్చిన డిటెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశాడు. ఈ విషయంలో అధికారులు వెంటనే స్పందించి ప్రకటించకుంటే పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు.

సమాచారం అందుకున్న సుల్తాన్ బజార్ ఏసీపీ డాక్టర్ చేతన, ఇన్‌స్పెక్టర్ సుబ్బరామిరెడ్డి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థితో మాట్లాడారు. అరంగటపాటు విద్యార్థికి నచ్చజెప్పడంతో రజనీకాంత్ కిందికి దిగాడు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ డిటెన్షన్ విధానం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. బీటెక్ మొదటి ఏడాదిలో 50 శాతం, రెండు, మూడు సంవత్సరాల్లో 60 శాతం క్రెడిట్స్ అమలు చేస్తున్నారని, దీనివల్ల 15 శాతం మంది విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని నష్టపోతున్నారని పేర్కొన్నాడు.

More Telugu News