Suicide: చదువులో వెనకబడిన కొడుకు.. తండ్రికి తెలిసిపోయిందని ఆత్మహత్య!

  • బీటెక్ నాలుగో ఏడాది చదువుతున్న కిషోర్
  • 20 సబ్జెక్టులు ఫెయిల్
  • కాలేజీకొచ్చి ఆరా తీసిన తండ్రి
  • ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్న కుమారుడు

కుమారుడి చదువుపై ఆరా తీయడానికి కళాశాలకు వచ్చిన తండ్రి.. కొడుకు మృతదేహాన్ని చూసి తల్లడిల్లిపోయాడు. ఉన్నత స్థితిలో ఉండగా చూడాలనుకున్న తాను ఇలాంటి పరిస్థితుల్లో చూస్తానని ఊహించలేకపోయానని గుండెలవిసేలా రోదించాడు. తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలంలోని ఓడలరేవులో జరిగిన ఈ ఘటన అందరి హృదయాలను ద్రవించి వేస్తోంది.

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం తోగమ్మి గ్రామానికి చెందిన కిషోర్‌కుమార్‌(20) ఓడలరేవులోని బీవీసీ కళాశాలలో బీటెక్ సీఎస్‌ఈ నాలుగో ఏడాది చదువుతున్నాడు. చదువులో వెనకబడిన కిషోర్ కుమార్ గత నాలుగేళ్లలో 20 సబ్జెక్టులు తప్పాడు. హాజరు శాతం కూడా చాలా తక్కువగా ఉండడంతో కళాశాల యాజమాన్యం కిషోర్ తండ్రికి సమాచారం ఇచ్చింది. విషయం తెలుసుకునేందుకు కిషోర్ తండ్రి కుమారుడితో ఫోన్‌లో మాట్లాడాడు. యాజమాన్యం ఇచ్చిన సమాచారం పాతదని, తానిప్పుడు అన్ని సబ్జెక్టులు పాసయ్యానని చెప్పాడు.

కుమారుడు ఇచ్చిన సమాధానంపై సంతృప్తి చెందని కిషోర్ తండ్రి శుక్రవారం కళాశాలకు బయలుదేరాడు. అతడు మార్గమధ్యంలో ఉండగానే కుమారుడు ఫోన్ చేసి కాలేజీకి వస్తున్నావా? అని ఆరా తీశాడు. దీనికి ఆయన లేదని సమాధానం ఇచ్చాడు. కానీ, కాలేజీకి వచ్చి ప్రిన్సిపాల్‌తో మాట్లాడాడు. అనంతరం కుమారుడిని కలిసేందుకు అతడు ఉండే హాస్టల్ గదికి వెళ్లాడు. దానికి తాళం వేసి ఉండడంతో ఫోన్ చేశాడు. ఫోన్ గదిలో మోగుతుండడంతో అనుమానం వచ్చి తలుపులు బద్దలుగొట్టి వెళ్లారు. లోపల కుమారుడి మృతదేహం సీలింగుకి వేలాడుతుండడంతో ఆ తండ్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. బోరున విలపించాడు. చదువులో వెనుకబడినందుకు ఇలా ప్రాణాలు తీసుకుంటాడని ఊహించలేదని కన్నీరు పెట్టుకున్నాడు. కాలేజీ యాజమాన్యం ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News