Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో ‘ఆపరేషన్ గరుడ’ జరుగుతోంది.. రాష్ట్రానికి కంపెనీలు రాకుండా భయపెడుతున్నారు!: మంత్రి లోకేశ్

  • హోదా, విభజన హామీలు నెరవేర్చాలని మాత్రమే కోరాం
  • స్టీల్ ఫ్యాక్టరీ కోసం పోరాడటంతో రమేశ్ ను టార్గెట్ చేశారు
  • ఐటీ దాడులపై ట్విట్టర్ లో స్పందించిన మంత్రి లోకేశ్

‘ఆపరేషన్ గరుడ’లో భాగంగానే పార్లమెంటు సభ్యుడు సీఎం రమేశ్ పై ఐటీ దాడులు జరుగుతున్నాయని మంత్రి నారా లోకేశ్ ఆరోపించారు. ఇది ఆంధ్రులపై దాడి చేయడమేనని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన 18 విభజన హామీలను నెరవేర్చాలని మాత్రమే తాము డిమాండ్ చేశామని లోకేశ్ స్పష్టం చేశారు. ఆంధ్రుల హక్కులను కోరినందుకే ప్రధాని మోదీ తమపై కక్ష కట్టారని విమర్శించారు. సీఎం రమేశ్, ఆయన బంధువుల ఇళ్లు, కార్యాలయాలపై ఈ రోజు ఐటీ శాఖ దాడులు నిర్వహించిన నేపథ్యంలో లోకేశ్ ట్విట్టర్ లో స్పందించారు.

మొన్న బీద మస్తాన్ రావు, నిన్న సుజనా చౌదరీ, ఈ రోజు సీఎం రమేశ్ ను టార్గెట్ చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప ఉక్కు-ఆంధ్రుల హక్కు అని ఉద్యమించినందుకే సీఎం రమేశ్ పై ఐటీ దాడులు జరుగుతున్నాయని మంత్రి లోకేశ్ పునరుద్ఘాటించారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం సీఎం రమేశ్ దీక్ష చేసి నేటికి 100 రోజులు పూర్తయ్యాయని తెలిపారు.

అయినా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు అయినా లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు రాకుండా ఉండేందుకే పారిశ్రామికవేత్తలు, కంపెనీలపై మోదీ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా హోదా సాధనలో వెనక్కి తగ్గబోమని లోకేశ్ స్పష్టం చేశారు.

More Telugu News