Andhra Pradesh: సిక్కోలు వాసులకు తీవ్ర ఆపద వచ్చింది.. ఆదుకునేందుకు అందరూ ముందుకు రావాలి!: సీఎం చంద్రబాబు

  • పొరుగురాష్ట్రం కంటే మనమే సరిగ్గా అంచనా వేశాం
  • బాగా పనిచేసిన అధికారులకు అవార్డులు అందజేస్తాం
  • ఈరోజు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు

తిత్లీ తుపానును పొరుగు రాష్ట్రం ఒడిశా కంటే మనమే సరిగ్గా అంచనా వేశామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న శాస్త్ర సాంకేతికతే అందుకు కారణమని వెల్లడించారు. విపత్తులను అడ్డుకోలేకపోయినా, విపరీతమైన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా నివారించగలమని పేర్కొన్నారు. శ్రీకాకుళంలో తుపాను సహాయక చర్యలపై వివిధ శాఖల అధికారులు, నేతలతో సీఎం చంద్రబాబు ఈ రోజు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

తిత్లీ తుపాను ఓ పెను విపత్తు అని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. సిక్కోలు ప్రజలకు తీవ్ర ఆపద ఎదురయిందనీ,  ఆదుకునేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సహాయక చర్యల్లో బాగా, చురుగ్గా పనిచేసిన వారికి అవార్డులు అందజేస్తామని తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అగ్నిమాపక, విపత్తు, నేవీ శాఖలు సహాయ చర్యల్లో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. యుద్ధ ప్రాతిపదికన రోడ్లు పూడ్చి, రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని ఆదేశించారు. మరికాసేపట్లో సీఎం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.

More Telugu News