Anantapur District: ప్రజాదరణ తగ్గుతుందన్న భయంతోనే ‘పరిటాల ఫ్యామిలీ’ హత్యలు చేయిస్తోంది!: వైసీపీ నేత ప్రకాశ్ రెడ్డి

  • పరిటాల ఫ్యాక్షన్ ను సినిమాల్లో కూడా చూపారు
  • అనంతలో టీడీపీ నేతలు వర్గ పోరును రాజేస్తున్నారు
  • సునీత సోదరుడే ఈ హత్య వెనుక ఉన్నాడు
ప్రజాదరణ తగ్గుతుందన్న భయంతోనే పరిటాల కుటుంబం వైసీపీ నేతలను హత్యలు చేయిస్తోందని ఆ పార్టీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. పరిటాల కుటుంబం ఫ్యాక్షన్ కుటుంబమని సినిమాల్లోనే చూపారని వెల్లడించారు. వైసీపీ ఆత్మకూరు మండల సీనియర్‌ నాయకుడు కేశవరెడ్డి(67) బుధవారం దారుణ హత్యకు గురైన నేపథ్యంలో ప్రకాశ్ రెడ్డి ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గ్రామాల్లో ఆధిపత్యం కోసం పరిటాల కుటుంబం వర్గపోరును రాజేస్తోందని మండిపడ్డారు.

పరిటాల సునీత సోదరుడు, ఆత్మకూరు మండల ఇన్ చార్జ్ బాలాజీ ప్రోద్బలంతోనే ఈ హత్య జరిగిందని ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. బాలాజీ సాయంతో ప్రత్యర్థి నరసింహారెడ్డి ఈ దారుణానికి ఒడిగట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జరిగిన ప్రసన్నాయపల్లి ప్రసాద్‌రెడ్డి, కందుకూరు శివారెడ్డి, తగరకుంట కొండారెడ్డి హత్యల వెనుక కూడా పరిటాల కుటుంబమే ఉందని విమర్శించారు.

నియోజకవర్గంలో అధికార పార్టీ చెప్పుచేతుల్లో అధికార యంత్రాంగం నడుస్తోందన్నారు. చంద్రబాబు జిల్లాలో పర్యటించిన వేళ ఈ హత్య జరగడం చూస్తుంటే ఆయన రాజకీయ హత్యలను ప్రోత్సహిస్తున్నట్లు ఉందని వ్యాఖ్యానించారు. కేశవరెడ్డి కుటుంబ సభ్యుల ఫిర్యాదుపై పోలీసులు నిష్పాక్షిక విచారణ జరపాలని డిమాండ్ చేశారు..
Anantapur District
Andhra Pradesh
YSRCP
Telugudesam
paritala sunita
prakash reddy

More Telugu News