India: షేర్లు అమ్మేసి.. బంగారంపై పెట్టుబడులు పెడుతున్న ఇన్వెస్టర్లు!

  • విలువైన లోహాల ధరలకు రెక్కలు
  • ఒక్కరోజులో రూ. 600 పెరిగిన బంగారం ధర
  • మరింతగా పెరగనున్న ధరలు

అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో నెలకొన్న పరిస్థితులు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను హరిస్తున్న వేళ, ఈక్విటీలను తెగనమ్ముకుని బయటపడుతున్న పెట్టుబడిదారులు, బులియన్ మార్కెట్ వైపు చూస్తుండటంతో బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చాయి. బంగారం కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు మద్దతు పలుకుతుండటం, పండగ సీజన్ అమ్మకాలు, త్వరలో రానున్న ధన త్రయోదశి నేపథ్యంలో బులియన్ మార్కెట్ కళకళలాడుతోంది.

గురువారం ఒక్కరోజే రూ. 600 పెరిగిన స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ. 31,991కి చేరింది. ఇదే సమయంలో వెండి ధర కిలోకు రూ. 415 పెరిగి రూ. 38,900కు పెరిగింది. బంగారం ధరలు సమీప భవిష్యత్తులో మరింతగా పెరగవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో ఒపెక్ దేశాల నుంచి ముడిచమురు ఉత్పత్తి పెరిగినట్టు వచ్చిన వార్తలతో బ్యారల్ క్రూడాయిల్ ధర రూ. 202 తగ్గి రూ. 5252గా నమోదైంది. క్రితం ముగింపు కంటే ఇది 3.70 శాతం తక్కువ.

More Telugu News