Uttam Kumar Reddy: కేసీఆర్‌ కుటుంబ సభ్యులు రాష్ట్రాన్ని దోచుకుతిన్నారు: ఉత్తమ్ ఫైర్

  • ప్రజల సొమ్ముతో ప్రగతి భవన్ నిర్మించారు
  • పెట్రోల్, డీజిల్ ధరలు నాలుగింతలు పెరిగాయి
  • కేసీఆర్, మోదీ సాధించిన ఘనత ఇదే

కేసీఆర్‌ కుటుంబ సభ్యులు రాష్ట్రాన్ని దోచుకుతిని దాచుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మండిపడ్డారు. ప్రజల సొమ్ముతో లక్ష చదరపు అడుగుల స్థలంలో ప్రగతిభవన్‌ నిర్మించుకున్నారని విమర్శించారు. గురువారం ఆయన తెలంగాణ జాతీయ మజ్దూర్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ‌ముషీరాబాద్‌ ఆర్టీసీ కళాభవన్‌లో నిర్వహించిన ఆత్మీయ అభినందన సభలో మాట్లాడుతూ... చమురు ధరలు మండిపోతుంటే ఆర్టీసీలో నష్టాలకు ఆ సంస్థే బాధ్యత వహించాలనడం సరికాదన్నారు. 2014 తర్వాత పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు నాలుగింతలు పెరిగాయన్నారు. కేసీఆర్‌ మళ్లీ గెలిస్తే ఆర్టీసీ ఉద్యోగులకు కష్టకాలమేనన్నారు.

తెలంగాణ పిల్లల ఆత్మబలిదానాలను గుర్తించి సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇస్తే.. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారన్నారు. తెలంగాణలో ఎక్కడా అభివృద్ధి కనబడటంలేదని ఉత్తమ్‌ విమర్శించారు. ఓ వైపు అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలు తగ్గుతుంటే.. దేశంలో, తెలంగాణలో మాత్రం ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయని మండిపడ్డారు. మోదీ, కేసీఆర్‌ సాధించిన ఘనత ఇదేనని ఉత్తమ్ ఎద్దేవా చేశారు.

 టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా, కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓట్లు వేయించాలని కోరారు. కాంగ్రెస్‌ హయాంలో తాను మంత్రిగా రాష్ట్రంలో లక్షలాది ఇళ్లు కట్టించానన్నారు. తాము కట్టించిన ఇళ్లపై తీవ్ర విమర్శలు చేసిన కేసీఆర్‌.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఇళ్లు ఎలా నిర్మించి ఇస్తారనే అంశంపై ఊహాత్మక సినిమా చూపించారని ఉత్తమ్‌ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News