samantha: ‘మీ టూ’ ఉద్యమంపై నెటిజన్ వ్యంగ్యం.. ఘాటుగా జవాబిచ్చిన సమంత!

  • ట్విట్టర్ లో నెటిజన్లకు సమాధానమిచ్చిన నటి
  • మీటూ ఉద్యమంపై పలువురి ప్రశ్నలకు స్పందన
  • తప్పుగా మాట్లాడిన నెటిజన్ కు తలంటిన సమంత

ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా సహాయక కార్యక్రమాలు చేపడుతున్న హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో అభిమానులతో టచ్ లో ఉంటుంది. వాళ్లు అడిగే సరదా ప్రశ్నలకు అంతే సరదాగా జవాబిస్తూ ఆటపట్టిస్తుంటుంది. అయితే తాజాగా మీ టూ ఉద్యమం సందర్భంగా కొందరు నెటిజన్ల వ్యవహారశైలిపై సామ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ టూ ఉద్యమంపై సమంత స్పందిస్తూ.. గాయని చిన్మయి శ్రీపాద చెప్పిన విషయాలను తాను నమ్ముతున్నానని తెలిపింది. దీంతో ఎప్పుడో పదేళ్ల క్రితం జరిగినదాన్ని ఇప్పుడు బయటపెట్టాల్సిన అవసరం ఏంటని పలువురు నెటిజన్లు సమంతను డైరెక్టుగానే అడిగేశారు.

దీనికి సమంత స్పందిస్తూ..‘మా భయం కూడా అదే.. తప్పంతా మాదే అని మీరెక్కడ అంటారోనన్న భయంతోనే సమయం కుదిరినప్పుడల్లా సమస్యలను బయటపెడుతున్నాం’ అని ట్వీట్‌ చేశారు. వెంటనే గౌరవ్‌ ప్రధాన్‌ అనే మరో నెటిజన్‌ ‘‘ఈరోజు మా అబ్బాయి నన్ను ఓ ప్రశ్న అడిగాడు. ‘డాడీ అసలు ఈ ‘మీ టూ’ అంటే ఏంటి?’ అని అడిగాడు. అప్పుడు నేను ‘మీటూ అంటే ఆడవారి రిటైర్మెంట్‌ బీమా పథకం’ అని చెప్పాను. అప్పుడు మా అబ్బాయి ‘అంటే ఏమిటీ?’ అని మళ్లీ ప్రశ్నించాడు.

దీంతో ‘ఆడవాళ్లు అన్ని విషయాల్లో తలదూరుస్తారు. కెరీర్‌ ముగిశాక ఈ బీమాను వాడుకుంటారు. అప్పుడు వాళ్ల గురించి విలేకరులు వార్తలు రాస్తుంటారు’’ అని చెప్పా. ఇది విని మా అబ్బాయి ‘గాడ్‌ బ్లెస్‌ ఇండియా’ అని అన్నాడు’’ అంటూ ఎకసెక్కాలాడాడు. ఈ కామెంట్లపై తీవ్రంగా స్పందించిన సమంత..‘అదే ప్రశ్న నీ కూతురు అడిగితే ఏం చెబుతావ్?’ అని ఘాటుగా ప్రశ్నించారు. దీంతో సదరు నెటిజన్ తోక ముడిచాడు.

More Telugu News