me too: మీటూ ఎఫెక్ట్.. విమర్శకులకు వార్నింగ్ ఇచ్చిన కాజల్ ఆగర్వాల్!

  • ఆ భూతాల గురించి మాట్లాడాలంటే ధైర్యం కావాలి
  • పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ మద్దతు ఇస్తున్నా
  • బురద చల్లే కార్యక్రమాలు మానుకోండి

సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులపై ప్రారంభమైన ‘మీ టూ’ ఉద్యమం హాలీవుడ్ నుంచి బాలీవుడ్, కోలీవుడ్ కు వ్యాప్తి చెందిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తమను నటులు నానా పటేకర్, అలోక్ నాథ్, గాయకుడు కైలాశ్ ఖేర్, రచయిత చేతన్ భగత, దర్శకుడు సుభాష్ కపూర్, కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ వేధించినట్లు పలువురు మహిళలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ మీ టూ ఉద్యమంపై స్పందించింది. మీ టూ ఉద్యమం సందర్భంగా మహిళలు ఒకరికొకరు అండగా నిలవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.

‘లైంగిక వేధింపులకు పాల్పడే ఇలాంటి భూతాలను ఎదుర్కొని, మాట్లాడాలంటే చాలా ధైర్యం కావాలి. తమ హక్కులు, న్యాయం కోసం పోరాడుతున్న ప్రతి ఒక్కరికి నేను మద్దతు తెలుపుతున్నా. లైంగిక వేధింపులకు గురైన నటీమణుల బాధను నేను అర్థం చేసుకోగలను. ఈ పరీక్షా సమయంలో మనమందరం ఒకరికొకరు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది.

కేవలం ప్రచారం కోసమే మహిళలు ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని చెప్పడం సరికాదు. ఇలాంటి బురద చల్లే కార్యక్రమాలు మానుకోండి’ అంటూ వార్నింగ్ ఇచ్చింది. సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులకు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందంటూ మీటూ టైమ్స్ అప్ అనే హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేసింది.

More Telugu News