Kurnool District: బట్టతలకు విగ్గుపెట్టి, అమ్మాయిలను వంచించిన వ్యక్తి ఆట కట్టించిన పోలీసులు!

  • మాయమాటలు చెప్పి వంచించే అవుజ రాజకుమార్
  • పలు రకాల పేర్లతో ఫేస్ బుక్ ఖాతాలు
  • కర్నూలు జిల్లాలో అరెస్ట్

అతనో ఆర్ఎంపీ డాక్టర్ గా కొంతకాలం పనిచేసిన వ్యక్తి. తనకున్న బట్టతలకు ఓ విగ్గు తగిలించి, సూటు, బూటు వేసుకుని ఆన్ లైన్ మాధ్యమంగా మోసాలకు తెరలేపి, తనకు పరిచయమైన అమ్మాయిలను ప్రేమ మత్తులోకి దింపి, వారిని దగా చేస్తాడు. ఇతని మాయలో ఎంతో మంది అమ్మాయిలు పడ్డారు. గతంలో ఓ మారు అరెస్టయి కూడా తన బుద్ధిని మార్చుకోని ఇతను, కర్నూలు జిల్లా మహానందికి మకాం మార్చి, ఓ స్కూలును లీజుకు తీసుకుని తన దందాను సాగిస్తుండగా, కర్నూలు పోలీసులు ఈ ప్రబుద్ధుడి ఆట కట్టించారు.

మరిన్ని వివరాల్లోకి వెళితే, పగిడ్యాల మండలానికి చెందిన అవుజ రాజకుమార్‌ అలియాస్‌ తేజర్షి అలియాస్‌ తేజ (23), నకిలీ ఫొటోలను ఫేస్ బుక్ లో పోస్టు చేసి, తన వాక్చాతుర్యంతో కట్టిపడే మెసేజ్ లు పెట్టడంలో నేర్పరి. తన మెసేజ్ లకు లైక్ కొట్టే అమ్మాయిలే ఇతని టార్గెట్. వారితో చాటింగ్ ప్రారంభించి, వారి ఫొటోలు సేకరించి, ఫొటోషాప్ సాయంతో మార్ఫింగ్ చేస్తాడు.

ఆ తరువాత ఆమె న్యూడ్ ఫొటోలు తన వద్ద ఉన్నాయని బెదిరిస్తూ, లైంగికంగా లొంగదీసుకుంటాడు. వారి నుంచి అందినంత దోచుకుని, ఆ ఖాతా మూసేసి, మరో ఖాతా తెరుస్తాడు. వేర్వేరు పేర్లతో ఎన్నో ఖాతాలు నడిపించిన ఈ దుర్మార్గుడు నంద్యాల, నల్గొండ, మదనపల్లి, కావలి, హైదరాబాద్, కర్నూలు, పత్తికొండ తదితర ప్రాంతాల్లో అమ్మాయిలను వంచించాడు.

బెంగళూరుకు చెందిన ఓ యువతిని ఇలాగే తేజ మోసం చేయగా, మనస్తాపంతో ఆమె తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసు విచారణలో భాగంగానే ఈ నీచుడి బండారాన్ని బట్టబయలు చేశారు పోలీసులు.

More Telugu News