Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. నిమిషాల వ్యవధిలో 1000 పాయింట్ల పతనం... లక్షల కోట్లు ఆవిరి!

  • ఈక్విటీలను తెగనమ్ముతున్న ఇన్వెస్టర్లు
  • ప్రభావం చూపిన ఇంటర్నేషనల్ మార్కెట్ల నష్టాలు 
  • సుమారు రూ. 2.50 లక్షల కోట్ల సంపద హుష్ కాకి!
అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో నెలకొన్న సంక్షోభం, పెరుగుతున్న క్రూడాయిల్ ధరలకు తోడు రూపాయి పతనం మరోసారి ప్రభావం చూపింది. ఈ ఉదయం భారత స్టాక్ మార్కెట్ సెషన్ ప్రారంభమైన నిమిషాల్లోనే బీఎస్ఈ సెన్సెక్స్ 1000 పాయింట్ల పతనాన్ని నమోదు చేసింది. అన్ని కంపెనీల ఈక్విటీలనూ ఇన్వెస్టర్లు పెద్దఎత్తున అమ్మకాలకు పెట్టారు. అంతర్జాతీయ పరిస్థితులకు తోడు, మరోమారు ఆర్థికమాంద్యం రానుందని వస్తున్న విశ్లేషణలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను హరించాయని నిపుణులు వ్యాఖ్యానించారు.

క్రితం ముగింపు 34,769 పాయింట్లతో పోలిస్తే, ఈ ఉదయం 9 గంటలకు మరింత నష్టంతో ప్రీ ట్రేడింగ్ 34,510 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, 9.15 గంటలకు 33,840 పాయింట్లకు, ఆపై 5 నిమిషాల వ్యవధిలో... అంటే, 9.20 గంటలకు 33,746 పాయింట్లకు దిగజారింది. ఆ సమయంలో ఇన్వెస్టర్లు సుమారు రూ. 2.50 లక్షల కోట్ల సంపదను నష్టపోయారు.

ఆపై కొంత మేరకు రికవరీ కనిపించగా, 9.50 గంటల సమయానికి నష్టం 800 పాయింట్లుగా నమోదైంది. బీఎస్ఈ సెన్సెక్స్ 50, నెక్ట్స్ 50, బీఎస్ఈ 100 సూచీలన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. ఇక ఎన్ఎస్ఈ విషయానికి వస్తే, ఓ దశలో 300 పాయింట్ల వరకూ నష్టపోయిన సూచిక, ప్రస్తుతం 251 పాయింట్ల నష్టంతో 10,208 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ-50లో 46 కంపెనీలు నష్టాల్లో నడుస్తున్నాయి. చమురు కంపెనీలు లాభాల్లో ఉండగా, ఆటో, ఫైనాన్స్, బ్యాకింగ్ కంపెనీలు ఒత్తిడిలో ఉన్నాయి.
Stock Market
BSE India
NSE India

More Telugu News