Supreme Court: వివాహేతర సంబంధం నేరం కాదన్న సుప్రీం తీర్పు ఎఫెక్ట్.. వివాహితను ప్రియుడితో పంపిన ఎస్సై!

  • దుబాయ్‌లో ఉంటున్న భర్త
  • ప్రియుడితో వెళ్లిపోయిన భార్య
  • వెతికి పట్టుకొచ్చి తిరిగి ప్రియుడితోనే పంపిన పోలీసులు

వివాహేతర సంబంధం నేరం కాదంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులోని భావాన్ని తప్పుగా అర్థం చేసుకుంటుండడం విపరీతాలకు దారి తీస్తోంది. చివరికి పోలీసులు సైతం ఇందులోని మర్మాన్ని గుర్తించకుండా వివాహేతర సంబంధం నేరం కాదన్న కోణంలోనే ఆలోచిస్తున్నారనడానికి తమిళనాడులో జరిగిన ఈ ఘటనే ఉదాహరణ.

ఓ వివాహిత ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఉద్యోగ రీత్యా సౌదీ అరేబియాలో ఉంటున్న వివాహిత భర్త అక్కడి నుంచే పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను వెతికి పట్టుకొచ్చారు. అయితే, ఇక్కడే మరో సమస్య మొదలైంది. వివాహితను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన పోలీసులు ఆమె కుటుంబ సభ్యులను కూడా పిలిపించారు. ఇరు వర్గాల మధ్య చర్చలు జరిగిన అనంతరం వివాహిత ప్రియుడితో ఉండేందుకే మక్కువ చూపింది. ఇందుకు ఆమె కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, వివాహేతర సంబంధం నేరం కాదని సుప్రీంకోర్టు చెప్పిందని వారికి వివరించిన పోలీసులు.. ఆమెను ప్రియుడి వద్దకు పంపించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు.

More Telugu News