Titli cyclone: ఉత్తరాంధ్రను వణికిస్తున్న తిత్లీ తుపాను.. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు.. రాత్రి నుంచి కుండపోత వర్షాలు

  • చిగురుటాకులా వణుకుతున్న ఉత్తరాంధ్ర
  • కుప్పకూలిన విద్యుత్ వ్యవస్థ
  • రైళ్ల రాకపోకలు నిలిపివేత
  • కుండపోతగా కురుస్తున్న వర్షాలు

తుపాను ఉత్తరాంధ్రను వణికిస్తోంది. తిత్లీ అతి తీవ్ర తుపానుగా మారి తీరాన్ని తాకింది. ఇది మరింత బలపడి పెను తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ చెబుతోంది. ఉత్తరాంధ్రకు తుపాను ముప్పుపై ఒడిశా-ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అనుకున్నట్టుగానే శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం గొల్లపాడు-పల్లిసారథి వద్ద గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో తుపాను తీరాన్ని తాకింది. గంటకు 14 కిలోమీటర్ల వేగంతో తుపాను కదులుతుండగా, గంటకు 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న పెను గాలులు ప్రజలను భయపెడుతున్నాయి.

గాలుల తాకిడికి జిల్లాలో పలుచోట్ల విద్యుత్ సరఫరా కుప్పకూలింది. తూర్పు కోస్తా రైల్వే రైళ్ల రాకపోకలను నిలిపివేసింది. ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, కంచిలి, మందస, నందిగాం, పలాస, వజ్రపు కొత్తూరు, మెళియాపుట్టి మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. సోంపేటలో గత రాత్రి నుంచి వర్షం కుండపోతగా కురుస్తోంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ధనుంజయరెడ్డి జిల్లా వ్యాప్తంగా హైఅలెర్ట్ ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచించారు.

తుపాను కారణంగా ఖుర్దా రోడ్-విజయనగరం మధ్య రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. 53 కిలోమీటర్ల మేర తుపాను కేంద్రం విస్తరించి ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. పలుచోట్ల కాల్ సెంటర్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఎస్సెమ్మెస్‌ల ద్వారా వరద హెచ్చరిక సందేశాలు పంపిస్తోంది. సహాయం కోసం 1100 నంబరుకు కాల్ చేయాలని అధికారులు కోరారు. విజయనగరంలోని కలెక్టరేట్‌లో కంట్రోల్ రూము ఏర్పాటు చేశారు. 08922 236947, టోల్ ఫ్రీ నంబరు 1077కు ఫోన్ చేసి సాయం కోరవచ్చు. విశాఖ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కాల్ సెంటరు నంబరు 1800 4250 0002.

More Telugu News