Amith shah: తెలంగాణలో 4,500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు: అమిత్ షా

  • అత్యధికంగా రైతు ఆత్మహత్యలు తెలంగాణలో జరిగాయి
  • మోదీ సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.99 వేల కోట్లు పంపించారు
  • ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చెయ్యలేదు

తెలంగాణలో 4,500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు. అత్యధికంగా రైతు ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని ఆయన స్పష్టం చేశారు. కరీంనగర్‌లో జరిగిన బీజేపీ తొలి ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా మాట్లాడుతూ.. ‘‘సాగునీటి ప్రాజెక్టుల గురించి ప్రచారం బాగా చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సార్లు వీటి గురించి చర్చించింది. కానీ ఇప్పటి వరకూ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చెయ్యలేదు. సాగునీరు రాలేదు. ప్రధాని మోదీ రూ.99 వేల కోట్లు సాగునీటి ప్రాజెక్టుల కోసం పంపించారు. కానీ రైతాంగానికి సాగునీరు రాలేదు.

మిషన్ కాకతీయ పేరుతో రాష్ట్రంలో ఉండే చెరువులు, కుంటలు మరమ్మతు చేయాలి కానీ అవి కూడా చేయలేదు. దీనికోసం రూ.1500 కోట్లు ఖర్చయ్యాయని చెప్పారు. దేశంలో ఎందరో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అత్యధికంగా రైతు ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఇక్కడ 4,500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మరోవైపు మోదీ గారు రైతులకు 70 ఏళ్లలో ఎవరూ చేయనట్టుగా 150 శాతం మద్దతు ధర ఇచ్చే చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ 150 వాగ్దానాలు చేశారు. వాటిలో ఏ ఒక్కటీ అమలు కాలేదు’’ అని దుయ్యబట్టారు.

More Telugu News