Pawan Kalyan: నేను మోదీ దత్త పుత్రుడినా?.. కొణిదెల వెంకట్రావు పుత్రుడిని: పవన్ కల్యాణ్

  • బీజేపీతో సంబంధంపై విమర్శలను తిప్పికొట్టిన పవన్
  • ఆ సమయంలో చంద్రబాబు కళ్లలో ఎంత మెరుపో
  • నేనేమీ జగన్‌లా హామీ ఇవ్వను
తాను మోదీకి దత్తపుత్రుడినని కొందరు విమర్శిస్తున్నారని, తానెవరికీ దత్త పుత్రుడిని కానని, కొణిదెల వెంకట్రావు పుత్రుడినని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లిలో జరిగిన బహిరంగ సభలో పవన్‌ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో తనకు సంబంధం ఉందన్న విమర్శలను ఖండించారు. తానిప్పటికీ బీజేపీ మోసం చేసిందన్న మాటమీదే నిలబడి ఉంటానని పేర్కొన్నారు. మోదీతో గొడవపెట్టుకున్నదే తానని పవన్ పేర్కొన్నారు.

ముఖ్యమంత్రుల సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోదీతో కరచాలనం చేస్తున్నప్పుడు ఆయన కళ్లలో ఎంతో ప్రేమ, వినయం కనిపించాయన్నారు. మరి తననెప్పుడైనా మోదీతో అలా చూశారా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రినైతే అలా చేస్తా, ఇలా చేస్తా అని జగన్‌లా తాను హామీలు ఇవ్వబోనని, తనను మళ్లీ సీఎంను చేస్తే ఇంకా బాగా పాలిస్తానని చంద్రబాబులా చెప్పనని పేర్కొన్నారు. అసలు తాను పార్టీని స్థాపించింది అందుకోసం కాదన్నారు.  

ఐటీ సోదాలు ఎక్కడో జరిగితే చంద్రబాబు భయపడిపోతున్నారని, ఆయనకెందుకో అంత భయం అని ఎద్దేవా చేశారు. పోలవరం సందర్శనకు ప్రతీ రోజూ వందలమంది వస్తున్నారని, అక్కడ చూసేందుకు అంత గొప్పగా ఏమీ లేదన్నారు. అక్కడ ఇనుప ఊచలు, సిమెంట్ తప్ప మరేమీ లేదన్నారు. అక్కడికి వెళ్లే వారికి తాగినంత మందు, తిన్నంత తిండి పెడితే ఎవరైనా బాగుందనే చెబుతారని పవన్ తీవ్రస్థాయిలో విమర్శించారు.
Pawan Kalyan
Narendra Modi
Polavaram
Chandrababu
Jana sena
Telugudesam

More Telugu News