gaddar: ప్రజలు కోరుకుంటే కేసీఆర్ పై పోటీ చేస్తా: గద్దర్

  • గజ్వేల్ లో ఓటు హక్కును నమోదు చేసుకున్నా
  • అక్కడ నుంచే పోటీ చేస్తా
  • ప్రతిపక్షాలతో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటా

తెలంగాణ ప్రజలు కోరుకుంటే రానున్న ఎన్నికల్లో తాను ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోటీ చేస్తానని ప్రజాగాయకుడు గద్దర్ తెలిపారు. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ స్థానంలో బరిలోకి దిగుతానని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలతో చర్చించిన తర్వాత దీనిపై తుది నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ఓటు హక్కును గజ్వేల్ లోనే నమోదు చేసుకున్నానని... అందుకే అక్కడ నుంచే పోటీ చేయాలని భావిస్తున్నానని చెప్పారు. ఓటు హక్కును నమోదు చేసుకోవడం తన జీవితంలో గొప్ప అనుభూతి అని అన్నారు. ఓటు హక్కు వినియోగంపై ఊరూరా తిరిగి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తానని తెలిపారు.

రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్ ను నిన్న గద్దర్ కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, మనీ, మీడియా, మాఫియా మధ్య ఓటు బందీ అయిందని చెప్పారు. ఓటు హక్కును నమోదు చేసుకోవడంతో మీరు భారతీయుడు అయ్యారని రజత్ కుమార్ తనతో అన్నారని తెలిపారు. దళితులకు మూడెకరాల భూమిని ఇస్తామన్న కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు. లక్ష ఉద్యోగాలు, రెండు పడకల ఇళ్లు ఏమయ్యాయని నిలదీశారు. దీనిపై ప్రజలే నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. 

More Telugu News