kondagattu: కొండగట్టు ప్రమాద బాధితులకు ఇంతవరకు మంజూరు కాని పరిహారం!

  • 63 మంది ప్రయాణికుల మృతి 
  • పరిహారం మంజూరుకు అడ్డంకిగా మారిన ఎన్నికల కోడ్
  • ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న క్షతగాత్రులు

కొండగట్టులో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైన ఘటనలో 63 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షలు, గాయపడిన వారికి రూ. 2.50 లక్షలు మంజూరు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. అయితే, ప్రమాదం జరిగి నెల రోజులు గడుస్తున్నా ఇంత వరకు పరిహారం మంజూరు కాలేదు.

గత నెల 19వ తేదీన దీనికి సంబంధించిన నివేదికను ఆ జిల్లా కలెక్టర్ సచివాలయానికి పంపారు. అయితే, ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ ద్వారా ఆపద్బంధు పథకం కింద కేవలం రూ. 50 వేలు మాత్రమే చెల్లించే వెసులుబాటు ఉంది. దీంతో, ఆ ఫైల్ ను ముఖ్యమంత్రి సహాయనిధికి పంపించారు. ఈ ఫైల్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేయాల్సి ఉంది. కానీ, ఆయన సంతకం చేయడానికి ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. దీనిపై ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ, ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్న తర్వాతే దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపారు.

మరోవైపు, ఈ ప్రమాదంతో నిరుపేదలైన బాధితులు, బాధిత కుటుంబాలు కోలుకోలేకపోతున్నాయి. గాయపడిన వారికి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ... ఇతర ఖర్చులు వారిని ఆర్థికంగా పీడిస్తున్నాయి.

More Telugu News