KSRTC: కొండముచ్చుకు బస్సు స్టీరింగ్ అప్పగించి చోద్యం చూస్తూ కూర్చున్న కర్ణాటక ఆర్టీసీ డ్రైవర్... వీడియో!

  • దావణగెరె నుంచి బ్రహ్మసాగర వెళుతున్న బస్సు
  • ఓ ఉపాధ్యాయుడి వెంట బస్సెక్కిన కొండముచ్చు
  • కోతి చేష్టలతో భయాందోళనలకు గురైన ప్రయాణికులు

కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన ఓ బస్ డ్రైవర్ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడంతో, ఇప్పుడు ఉద్యోగానికి దూరమయ్యాడు. ఓ కొండముచ్చుకు స్టీరింగ్ అప్పగించిన ఆయన, అది స్టీరింగ్ పై కూర్చుని అటూ ఇటూ తిప్పుతుంటే చోద్యం చూశాడు. ఈ వీడియోను చిత్రీకరించిన ఓ ప్రయాణికుడు, దాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో అధికారులు తీవ్రంగా స్పందించారు.

దావణగెరె డివిజన్ లో కేఎస్ఆర్టీసీలో డ్రైవర్ గా పనిచేస్తున్న ప్రకాష్ ఈ పని చేశాడు. తను డ్రైవింగ్ సీటులో కూర్చుని, స్టీరింగ్ పై కొండముచ్చును కూర్చోబెట్టాడు. దావణగెరె నుంచి బ్రహ్మసాగర వెళుతున్న బస్సులో ఈ నెల 1న ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. డ్రైవర్ ను విధుల నుంచి తొలగించామని, అతనిపై విచారణకు ఆదేశించామని, అధికారి ఒకరు తెలిపారు.

కాగా, బస్సులోకి ఈ కొండముచ్చు ఓ ఉపాధ్యాయుడి వెంట వచ్చిందని, అతను ఇదే బస్సులో నిత్యమూ ప్రయాణిస్తుంటాడని తెలుస్తోంది. బస్సులోకి టీచర్ తో పాటు వచ్చిన కొండముచ్చు స్టీరింగ్ ఎక్కగా, కోతి చేష్టలకు భయాందోళనలకు గురైన ఇతర ప్రయాణికులు దాన్ని తొలగించాలని డ్రైవర్ కు సూచించినా, ఆయన వినలేదన్న ఫిర్యాదులూ వచ్చాయి. స్టీరింగ్ పై కూర్చున్న కొండముచ్చు వీడియోను మీరూ చూడవచ్చు.

More Telugu News