Anantapur District: తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్.. వైసీపీ నేత పెద్దారెడ్డి అరెస్ట్!

  • ముచ్చుకోట రిజర్వాయర్ నీటి విడుదలకు పాదయాత్ర
  • ఉదయం నుంచే వైసీపీ నేతలు, కార్యకర్తల అరెస్టులు
  • అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేసిన పెద్దారెడ్డి

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర ఇటీవల 3,000 కి.మీ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ కు సంఘీభావంగా, ముచ్చుకోట రిజర్వాయర్ కు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తాడిపత్రి వైసీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ రోజు పాదయాత్ర నిర్వహించారు. దీంతో పెద్దారెడ్డితో పాటు ఆయన అనుచరులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.


పెద్దారెడ్డి పాదయాత్రకు పోలీసులు అంగీకరించలేదు. పాదయాత్ర నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచే ముచ్చుకోట గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. ఉదయాన్నే తాడిపత్రి నియోజకవర్గంలో వైసీపీ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ముచ్చుకోట నుంచి పెద్దపప్పూరు దాకా పాదయాత్ర చేసేందుకు వచ్చిన పెద్దారెడ్డిని అరెస్ట్ చేశారు. దీంతో పోలీసుల వ్యవహారశైలిపై పెద్దారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శాంతియుతంగా పాదయాత్ర చేసేందుకు వచ్చిన తనను అరెస్ట్‌ చేయడం సరికాదని వ్యాఖ్యానించారు.

More Telugu News