Andhra Pradesh: ముఖ్యమంత్రి యువనేస్తం పథకంపై స్పందించిన మంత్రి నారా లోకేశ్!

  • విజయవాడలో జరిగిన భారీ ర్యాలీకి ప్రశంస
  • మరిన్ని పథకాలకు ఇది స్ఫూర్తినిస్తోందని వ్యాఖ్య
  • ట్విట్టర్ లో స్పందించిన మంత్రి

ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ, ఆర్థిక సాయం కోసం ప్రభుత్వం ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద నిరుద్యోగ యువతకు ఏదైనా మూడు అంశాల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు నెలకు రూ.వెయ్యి నిరుద్యోగ భృతిని ప్రభుత్వం అందజేస్తోంది. ఈ నెల 25తో ముఖ్యమంత్రి యువనేస్తం పథకానికి దరఖాస్తు చేసుకునే గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఏపీ ఐటీ, పంచాయితీరాజ్ మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ లో స్పందించారు.

యువనేస్తం పథకాన్ని ప్రారంభించి లక్షలాది మంది నిరుద్యోగుల్ని ఆదుకుంటున్న సీఎం చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘యువనేస్తం పథకాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రిగారికి కృతజ్ఞతలు తెలుపుతూ విజయవాడలో జరిగిన భారీ ర్యాలీలో వేలాది మంది యువకులు పాల్గొనడం నిజంగా స్ఫూర్తిదాయకం. యువనేస్తం పథకానికి వస్తున్న ఈ అపూర్వ స్పందన యువతకోసం మరిన్ని అభ్యుదయ కార్యక్రమాలను రూపొందించేందుకు మమ్మల్ని ఉత్తేజపరుస్తోంది’ అని ఈరోజు ట్విట్ చేశారు. యువనేస్తం పథకం కింద ఇప్పటివరకూ 7.26 లక్షల మంది దరఖాస్తు చేయగా, 76,856 దరఖాస్తులను అధికారులు తనిఖీ చేశారు. వీటిలో 8,775 దరఖాస్తులను ఆమోదించారు.

ముఖ్యమంత్రి యువనేస్తం లబ్ధిదారుల అర్హతలు:

  • దరఖాస్తుదారులు నిరుద్యోగులై ఉండాలి మరియు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారై ఉండాలి.
  • కనీస విద్యార్హతలు గ్రాడ్యుయేషన్ లేదా డిప్లోమా.
  • వయసు 22-35 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
  • కుల, సామాజిక ప్రాధాన్యత నిబంధనల ప్రకారం ఇవ్వబడుతుంది.
  • దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న కుటుంబానికి చెందిన వారై వుండాలి.
  •  కుటుంబానికి చెందిన అన్ని అర్హతలు పొందిన లబ్ధిదారులను పరిగణనలోకి తీసుకోవాలి.
  • మూవబుల్ / అస్థిర ప్రాపర్టీస్: 4 చక్రాలు కలిగినవి అనర్హమైనవి.
  • అధికారిక విద్యను అభ్యసిస్తున్న వారు అర్హులు కాదు.
  • పబ్లిక్ / ప్రైవేట్ సెక్టార్ / క్వాసి-ప్రభుత్వం లేదా స్వయం ఉపాధిలో పనిచేసే వారికి అర్హత లేదు.
  • సెంట్రల్ / స్టేట్ ప్రభుత్వ సర్వీసు నుండి ఉద్యోగి తొలగించబడకూడదు.
  •  దరఖాస్తుదారు ఏ నేరారోపణను కలిగి ఉండరాదు.
  • నిరుద్యోగ భృతి పొందేందుకు కావలిసిన ముఖ్య ధ్రువపత్రాలు - ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఎస్.ఎస్.సి, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్.

More Telugu News