Hoarding: సిగ్నల్ వద్ద కుప్పకూలిన భారీ హోర్డింగ్.. నలుగురి దుర్మరణం!

  • పుణెలోని రైల్వే స్టేషన్ గేట్ వద్ద ఘటన
  • హోర్డింగ్‌ను తొలగిస్తుండగా కూలిన వైనం
  • ఐదు ఆటోలు, రెండు బైక్‌లు, కారు ధ్వంసం

పూణె రైల్వే స్టేషన్ సమీపంలో భారీ ప్రమాదం జరిగింది. సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వాహనాలపై 40 అడుగుల భారీ హోర్డింగ్ కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. తన భార్య అస్థికలను కలిపి వస్తున్న 40 ఏళ్ల వ్యక్తి కూడా ఈ ప్రమాదంలో మృతి చెందడం విషాదం. రైల్వే స్టేషన్ సమీపంలోనే జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.

షాహిర్ అమర్ షేక్ చౌక్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో హోర్డింగ్‌ను తొలగిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టు డిప్యూటీ కమిషనర్ బి.సింగ్ తెలిపారు. మృతి చెందిన వారిని కసర్ (70), షామ్ రావ్ ధోట్రె (48), శివాజీ పర్‌దేశీ (40), జావేద్ ఖాన్(40)లుగా గుర్తించారు.

పరదేశీ భార్య గురువారం మృతి చెందింది. శుక్రవారం ఆమె అస్థికలను కలిపేందుకు పరదేశీ, ఆయన కుమారుడు, కుమార్తె, తల్లి కలిసి వెళ్లారు. అనంతరం తిరిగి ఆటోలో ఇంటికి వస్తుండగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిన ఆటోపై హోర్డింగ్ కుప్పకూలింది. ఈ ఘటనలో శివాజీ పరదేశీ అక్కడికక్కడే మృతి చెందారు. రోజు తేడాలో భార్యభార్తలు ఇద్దరూ మృతి చెందడంతో ఆయన కుటుంబంలో విషాదం నిండుకుంది. ఆటోలో ఉన్న మిగతా ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

ఈ ఘటనలో ఐదు ఆటోలు, రెండు ద్విచక్ర వాహనాలు, ఓ కారు ధ్వంసమైనట్టు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్టు చెప్పారు. ప్రమాద ఘటనపై దర్యాప్తునకు అత్యున్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారి తెలిపారు.

  • Loading...

More Telugu News