నేను గుడికి వెళ్లడం బీజేపీకి నచ్చడం లేదు: రాహుల్ గాంధీ

05-10-2018 Fri 21:40
  • ఎన్నో ఏళ్లుగా ఆలయాలకు, మసీదులకు, గురుద్వారాలకు వెళ్తున్నా
  • నాపై విమర్శలతో నేనేమీ డిస్టర్బ్ కావట్లేదు
  • మిత్రపక్షాలు కోరితే ప్రధాని బాధ్యతలు స్వీకరిస్తా
ఆలయాలకు తాను వెళ్లడం బీజేపీకి నచ్చడం లేదని, వాళ్లకు కోపమొస్తోందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఎన్నో ఏళ్ల నుంచి ఆలయాలకు, మసీదులకు, గురుద్వారాలకు తాను వెళ్తున్న విషయాన్ని గుర్తుచేశారు. తాను ఆలయాలకు వెళ్లడంపై చేస్తున్న విమర్శల వల్ల తానేమీ డిస్టర్బ్ కావడం లేదని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా వచ్చే ఎన్నికలు, ప్రధాని పదవి అంశాలపై రాహుల్ మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలని పిలుపు నిచ్చారు. ముందుగా బీజేపీని ఓడించాలని నిర్ణయించామని, ఎన్నికలు ముగిసిన తర్వాతే ప్రధాని ఎవరు అవుతారనే అంశం గురించి ఆలోచిస్తామని, ఈ మేరకు కూటమి పార్టీలతో చర్చిస్తామని చెప్పారు. మిత్రపక్షాలు కోరుకుంటే ప్రధాని అవుతారా? అనే ప్రశ్నకు రాహుల్ స్పందిస్తూ, అందుకు, తాను సిద్ధమేనని స్పష్టం చేశారు.