Vijay devarakonda: ఆ ఫొటోలో ఉన్న అమ్మాయి చాలా మంచిది.. మిగతా విషయాలు మరిచిపోండి!: విజయ్ దేవరకొండ

  • రెండు సినిమాలతో భారీ క్రేజ్ వచ్చింది
  • దాన్ని పట్టించుకునే తీరిక కూడా లేదు
  • ప్రియురాలి విషయమై స్పందించిన విజయ్
అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి వరుస హిట్లతో విజయ్ దేవరకొండ కెరీర్ టాప్ స్పీడ్ లో కొనసాగుతోంది. తాజాగా ఈ రోజు రిలీజ్ అయిన ‘నోటా’ సినిమాతో విజయ్ తమిళంలో కూడా అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా విజయ్ మీడియాతో పలు అంశాలపై ముచ్చటించాడు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం తర్వాత తనకు భారీగా క్రేజ్ వచ్చిందని విజయ్ తెలిపాడు.

ప్రేక్షకుల్లో తనకున్న క్రేజ్ గురించి ఆలోచించేందుకు సమయమే లేదని చెప్పాడు. ఓ సినిమా తర్వాత మరో సినిమాను చేస్తూ తాను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నానని వ్యాఖ్యానించాడు. నోటా సినిమా ప్రమోషన్ లో భాగంగా చెన్నై, కొచ్చి, బెంగళూరు తదితర ప్రాంతాల్లో ప్రచారం చేశానని విజయ్ చెప్పాడు. ఎవడే సుబ్రమణ్యం సినిమా తర్వాత నటనను మానేసి దర్శకత్వం-రచన వైపు వెళ్లాలని అనుకున్నాననీ దేవరకొండ అన్నాడు. కానీ అంతలోనే వరుస సినిమా అవకాశాలు వచ్చాయన్నాడు. ప్రస్తుతం దక్కిన గుర్తింపు, క్రేజ్ తో తాను ఆనందంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు.

తన పేరును ఇంగ్లిష్‌లో అనువదించి ‘కింగ్‌ ఆఫ్‌ ది హిల్‌’ అని సొంత ప్రొడక్షన్ సంస్థకు పేరు పెట్టినట్లు విజయ్ దేవరకొండ తెలిపాడు. ఇప్పుడు ఎవరైనా మంచి స్క్రిప్టుని తీసుకొస్తే వాళ్లని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఈ సంస్థ పెట్టినట్లు వెల్లడించాడు. తనకు కథపైనా, వ్యక్తులపైనా నమ్మకం కుదిరితేనే సినిమాను చేస్తానని దేవరకొండ స్పష్టం చేశాడు.

ఇక ఇటీవల ఓ విదేశీ యువతితో దిగిన పలు ఫొటోల విషయంపై కూడా విజయ్ స్పందించాడు. ఆ ఫొటోలో ఉన్న అమ్మాయి చాలా మంచిదని విజయ్ కితాబిచ్చాడు. ఇక మిగిలిన విషయాలను మరిచిపోవాలని నవ్వుతూ జవాబిచ్చాడు. బెల్జియం దేశానికి చెందిన ఓ యువతితో విజయ్ డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. విజయ్ కుటుంబ సభ్యులతో కలిసి మిలానే డిన్నర్ చేస్తున్న ఫొటో ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.

Vijay devarakonda
Tollywood
nota
movie
Cinema news
love affair
milaney
dutch girl

More Telugu News