Andhra Pradesh: ఉప ఎన్నిక జరిగేనా? : ‘గీతం’ మూర్తి మరణంతో ఖాళీ అయిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం

  • వచ్చే ఏడాది జులైతో ముగియనున్న గడువు
  • ఇంకా మిగిలింది పది నెలల కాలమే
  • ఎన్నికల కమిషన్‌ నిర్ణయం ఏమిటన్న దానిపై చర్చ
గీతం విద్యాసంస్థల అధినేత ఎం.వి.వి.ఎస్‌.మూర్తి హఠాన్మరణంతో ఖాళీ అయిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికలు వచ్చేనా? అన్న చర్చ మొదలయింది. నాలుగేళ్ల పదవీ కాలానికి సంబంధించి 2015 జూన్‌లో స్థానిక సంస్థల కోటా కింద మూర్తి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2019 జులైతో ఈ స్థానం కాలపరిమితి ముగియనుంది. అంటే మిగిలింది పది నెలల సమయమే.

స్థానిక సంస్థల సభ్యుల కాపరిమితి వచ్చే ఏడాది జులై వరకు ఉన్నందున ఉప ఎన్నిక అనివార్యమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే కనీసం ఏడాది కాలపరిమితి ఉంటే తప్ప ఎన్నికల కమిషన్‌ ఉప ఎన్నికల నిర్వహణకు సుముఖత వ్యక్తం చేయదు. కానీ ఈ స్థానం స్థానిక సంస్థలతో ముడిపడి ఉన్నందున ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది.

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు కాల్చి చంపడంతో ఈ స్థానం కూడా ఖాళీ అయింది. అయితే సార్వత్రిక ఎన్నికలకు ఇంకా తొమ్మిది నెలలే గడువు ఉన్నందున ఈ స్థానానికి ఎన్నిక వచ్చే అవకాశం లేదంటున్నారు. అటువంటప్పుడు ఎమ్మెల్సీ స్థానం విషయంలో భిన్నమైన నిర్ణయం తీసుకుంటారా? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఏదైనా ఎన్నికల కమిషన్‌ నిర్ణయమే అంతిమమని చెబుతున్నారు.
Andhra Pradesh
Visakhapatnam District
MLC

More Telugu News