Beeda Mastan Rao: అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన బీద మస్తాన్ రావు, రవిచంద్ర!

  • మస్తాన్ రావు, రవిచంద్రల ఫోన్లు స్విచ్చాఫ్
  • ఎవరికీ అందుబాటులో లేకుండా పోయిన సోదరులు
  • టీడీపీ పెద్దలకు బినామీగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు

నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు బీద మస్తాన్ రావు, ఆయన సోదరుడు రవిచంద్రలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. వీరిరువురి కంపెనీలపైనా నిన్న మొదలైన ఐటీ దాడులు, నేడు కూడా సాగుతుండగా, ఎవరికీ అందుబాటులోకి లేకుండా పోయిన వీరిద్దరినీ కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నించిన మీడియా విఫలమైంది. వీరు తమ సెల్ ఫోన్లను కూడా స్విచ్చాఫ్ చేసుకున్నారు.

కాగా, కొందరు తెలుగుదేశం పార్టీ పెద్దలకు బీద మస్తాన్ రావు బినామీగా వ్యవహరిస్తున్నారని గతంలో ఆరోపణలు వచ్చిన విషయం కూడా తెలిసిందే. దామవరం, ఇసుకపల్లిలోని బీఎంఆర్ (బీద మస్తాన్ రావు) కంపెనీల్లో నేడు ఉదయం కూడా సోదాలు జరుపుతున్న అధికారులు, అక్కడి కంప్యూటర్లను, కార్యాలయ అధికారుల కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు.

రొయ్యల వ్యాపారంలో ఉన్న వీరు కొన్ని విదేశీ లావాదేవీలు కూడా జరిపినట్టు అధికారులు గుర్తించారని తెలుస్తోంది. బీద రవిచంద్రకు మంత్రి పదవి వస్తుందని, మస్తాన్ రావును టీటీడీ చైర్మన్ పదవి వరిస్తుందని గతేడాది వార్తలు వచ్చాయి. మంత్రి పదవి, టీటీడీ చైర్మన్ పదవి రాకున్నా, వీరిద్దరూ టీడీపీలో కొనసాగుతూనే వచ్చారు. నేడు వీరిపై దాడులు జరుగుతుండటం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.

More Telugu News