2018కి గానూ అవార్డులను ప్రకటించిన రామినేని ఫౌండేషన్!
- బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కు గౌరవం
- దర్శకుడు నాగ్ అశ్విన్, రచయిత వెంకటరమణకు చోటు
- 12న మంగళగిరిలో అవార్డు ప్రదానోత్సవం
ఈ వివరాలను డా.రామినేని ఫౌండేషన్ చైర్మన్ ధర్మప్రచారక్, కన్వీనర్ పాతూరి నాగభూషణం ఈ రోజు ప్రకటించారు. ఈ నెల 12న గుంటూరు జిల్లా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరుగుతుందని చైర్మన్ ధర్మప్రచారక్ తెలిపారు. మంగళగిరిలో జరిగే ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ లు ముఖ్య అతిథులుగా హాజరవుతారని వెల్లడించారు.
గతేడాది సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి, ప్రొ.గీతా కె. వేముగంటి, సినీ నటుడు ఆర్.నారాయణమూర్తిలను ఈ అవార్డు వరించింది. వీరితో పాటు సురభి కళాకారుడు ఆర్.నాగేశ్వరరావు కూడా రామినేని పురస్కారానికి ఎంపికయ్యారు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన, విశేష కృషి చేసిన వ్యక్తులకు రామినేని ఫౌండేషన్ ఏటా అవార్డులను అందజేస్తోంది.