KCR: కేసీఆర్ నాకు తండ్రిలాంటి వారు.. చొప్పదండి టికెట్ నాకే ఇస్తారు!: మాజీ ఎమ్మెల్యే బోడిగె శోభ

  • టీఆర్ఎస్ తో నాది 18 ఏళ్ల అనుబంధం
  • కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంపై విశ్వాసం ఉంది
  • చొప్పదండిలో పార్టీ జెండాను ఎగరవేస్తాం

తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)ని తాను వీడుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని మాజీ ఎమ్మెల్యే బోడిగె శోభ తెలిపారు. తాను బీజేపీలో చేరబోవడం లేదని ఆమె స్పష్టం చేశారు. టీఆర్ఎస్ తో తనది 18 ఏళ్ల అనుబంధమని శోభ వ్యాఖ్యానించారు. నల్గొండ జిల్లా మర్రిగూడలో ఈ రోజు ప్రజా ఆశీర్వాద సభ జరగనున్న నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడారు.

కేసీఆర్ తనకు తండ్రిలాంటి వారనీ, తనకు ముఖ్యమంత్రి న్యాయం చేస్తారన్న నమ్మకం ఉందని తెలిపారు. చొప్పదండి పార్టీ టికెట్ తనకే దక్కుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని బోడిగె శోభ తెలిపారు. అందరు నేతలను కలుపుకుని చొప్పదండిలో పార్టీ జెండాను ఎగురవేస్తామని ఆమె ప్రకటించారు. పార్టీ విజయం కోసం రేపటి నుంచి గ్రామాల్లో ప్రచారం ప్రారంభిస్తామని వెల్లడించారు. సీఎం కేసీఆర్ చొప్పదండి టికెట్ ను తనకే కేటాయిస్తారని శోభ అన్నారు.

2014 ఎన్నికల్లో చొప్పదండి నియోజకవర్గం నుంచి బోడిగె శోభ గెలుపొందారు. దాదాపు 2.49 లక్షల మంది ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గం ప్రజలను ప్రధానంగా తాగునీటి సమస్య వేధిస్తోంది. ఎస్సారెస్పీ కాలువ, ఎల్లంపల్లి టన్నెల్స్ నియోజకవర్గం నుంచే వెళుతున్నా.. సాగు, తాగు నీటికి స్థానికులు తీవ్ర ఇక్కట్లు పడాల్సి వస్తోంది.

More Telugu News