thanusri datta: తనుశ్రీకి మద్దతు ప్రకటించిన మేనకా గాంధీ

  • #metoo ఉద్యమం ప్రారంభం కావాలి
  • బాధితురాలు ఎప్పుడు చెప్పిందనేది ముఖ్యం కాదు
  • వేధింపుల గుర్తులు మనసులో ఉండిపోతాయి

బాలీవుడ్ నటుడు నానా పటేకర్ తనను వేధించారని నటి తనుశ్రీ దత్తా ఆరోపించిన విషయం తెలిసిందే. పదేళ్ల క్రితం ఓ సినిమా సెట్‌లో పాటను చిత్రీకరిస్తున్న సమయంలో ఆయన తన చెయ్యి పట్టుకున్నారని తనుశ్రీ పేర్కొంది. ఈ విషయం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఈ విషయంపై మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. కొందరు తనుశ్రీకి అండగా నిలిస్తే... ఆ పాటకు కొరియోగ్రఫీ అందించిన కొరియోగ్రాఫర్ మాత్రం నానా పటేకర్‌కు మద్దతుగా మాట్లాడారు. తాజాగా కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ.. తనుశ్రీకి మద్దతు తెలిపారు.

‘‘మన దేశంలో కూడా #metoo ఉద్యమం ప్రారంభం కావాలి. దీని ద్వారా ఏ మహిళ అయినా సరే తనకు ఎదురైన వేధింపుల గురించి మాకు ఫిర్యాదు చేయొచ్చు. మేం దానిపై విచారణ జరుపుతాం’’ అని మేనక ఓ టీవీ ఛానెల్‌తో అన్నారు. ‘తనుశ్రీ ఇన్నేళ్ల తర్వాత వేధింపుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రజలు అడుగుతున్నారు’ అని మేనకా గాంధీ దృష్టికి తీసుకెళ్లగా ఆమె దీటుగా స్పందించారు.

‘హాలీవుడ్‌ దర్శకుడు హార్వే వెయిన్‌స్టీన్ వేధించారని ఓ నటి చెప్పినప్పుడు కూడా ప్రజలు ఇలానే అన్నారు. కానీ బాధితురాలు ఎప్పుడు ముందుకొచ్చి చెప్పింది అనేది ముఖ్యం కాదు. నాకు తెలుసు మనల్ని ఎవరైనా వేధిస్తే.. ఆ గుర్తులు అలాగే మనసులో ఉండిపోతాయి’ అని ఆమె పేర్కొన్నారు.

More Telugu News