Andhra Pradesh: గుప్త నిధులు తవ్వాడని పాలకమండలి వేధింపులు.. మనస్తాపంతో ప్రాణాలు తీసుకున్న అర్చకుడు!

  • తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో ఘటన
  • శివాలయంలో మల్లికార్జున శర్మ అర్చకత్వ బాధ్యతలు
  • విధుల నుంచి తొలగించడంపై మనస్తాపం

తూర్పు గోదావరి జిల్లాలో ఓ అర్చకుడు ప్రాణాలు తీసుకున్నాడు. ఆలయ పాలక మండలి తనను మానసికంగా వేధిస్తున్నారనీ, అర్చకత్వ బాధ్యతల నుంచి తప్పించారని ఆరోపిస్తూ పురుగుల మందు తాగాడు. దీంతో ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కణుపూరు శివాలయంలో మల్లికార్జున శర్మ గత 30 ఏళ్లుగా అర్చకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆలయ పాలక మండలి శర్మను ఇటీవల విధుల నుంచి తప్పించింది. ఈ నేపథ్యంలో నిన్న సెల్ఫీ సూసైడ్ వీడియోను శర్మ తీసుకున్నాడు. అందులో ఆలయ పాలకమండలి వేధింపుల కారణంగానే తాను చనిపోతున్నట్లు ఆరోపించాడు. పాలకమండలి  సభ్యులు పగబట్టి తనను విధుల నుంచి తప్పించారని ఆవేదన వ్యక్తం చేశాడు.

తన ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరిన శర్మ.. వారి పేర్లను సెల్ఫీ వీడియోలో ప్రస్తావించాడు. అధికారులు సరైన చర్యలు తీసుకోకుంటే తన స్థానంలో వచ్చే ఎవరికైనా ఇదే గతి పడుతుందని హెచ్చరించాడు. గుప్త నిధుల తవ్వకాలు జరిపామని తనపై, తన కుటుంబ సభ్యులపై నిందలు మోపిన వారిని విడిచిపెట్టొద్దని కోరాడు.

More Telugu News