suecide attempt: యాదగిరిగుట్ట శ్రీచక్ర సముదాయం పైనుంచి దూకి ప్రేమ జంట ఆత్మహత్యా యత్నం

  • బాధితులిద్దరూ దగ్గర బంధువులు
  • వారిద్దరి పెళ్లికి అంగీకరించని బాలిక తల్లిదండ్రులు
  • పెళ్లిచేసుకోవాలని ఇంటి నుంచి పారిపోయిన జంట

అవగాహనా లోపం...బంధువులు వెంటాడుతున్నారన్న భయం...ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఓ ప్రేమజంట బలవన్మరణానికి యత్నించింది.  మూడంతస్తుల మేడపై నుంచి దూకి ఆత్మహత్యా యత్నం చేశారు. తీవ్రంగా గాయపడి ఆస్పత్రిపాలయ్యారు.

తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్టలో మంగళవారం ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది, వివరాల్లోకి వెళితే...సికింద్రాబాద్‌ ఆల్వాల్‌లో ఉంటున్న మనీష్‌ (21), అదే ప్రాంతానికి చెందిన ఇంటర్‌ చదువుతున్న బాలిక దగ్గర బంధువులు. వీరిద్దరూ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మనీష్‌ సౌండ్‌ సిస్టమ్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. వీరి ప్రేమ విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు కుమార్తెకు పోలీసులతో కౌన్సెలింగ్‌ ఇప్పించారు. అయినా ఇద్దరూ మనసు మార్చుకోలేదు. పెద్దలను వ్యతిరేకించి పెళ్లిచేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చి గత నెల 27న ఇంట్లో నుంచి పారిపోయారు.

మంగళవారం యాదగిరిగుట్ట వచ్చారు. అక్కడి శ్రీచక్ర సముదాయంలో గదికోసం ప్రయత్నించారు. సరైన గుర్తింపు కార్డు లేకపోవడంతో నిర్వాహకులు వారికి గది ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఏం చేయాలో అర్థంకాక అక్కడే చాలాసేపు తచ్చాడారు. మరోవైపు బాలిక కుటుంబ సభ్యులు వీరి గురించి తెలుసుకుని యాదగిరిగుట్టలో వెతకడం ప్రారంభించారు. ఒకవైపు ఎక్కడ ఉండాలో అర్థంకాని పరిస్థితి, మరోవైపు తమ కోసం వెతుకుతున్నారన్న సమాచారం తెలియడంతో ఆందోళనకు గురైన ప్రేమ జంట శ్రీచక్ర సముదాయంపైకెక్కి కిందకి దూకేశారు.

ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడడంతో స్థానికులు వారిని 108 అంబులెన్స్‌లో భువనగిరి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతరం సికింద్రాబాద్‌ ఆస్పత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News