MIRYALAGUDA: మారుతీరావును మేం సమర్థించడం లేదు.. మమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటే తిరగబడతాం!: ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ

  • మారుతీరావు దంపతులు మహాసభలో సభ్యులుగా ఉన్నారు
  • వీలైతే రెండు కుటుంబాలను కలపండి.. లేదంటే తప్పుకోండి
  • చెన్నైలో మీడియా సమావేశంలో అధ్యక్షుడు రామకృష్ణ

మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య ఘటన తర్వాత కొన్ని కుల సంఘాలు తమపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు టంగుటూరి రామకృష్ణ తెలిపారు. రెండు కుటుంబాల మధ్య జరిగిన దుర్ఘటనను రాజకీయం చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. తాము మారుతీరావును సమర్ధించడం లేదని స్పష్టం చేశారు. ఈ రోజు చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడారు.

మారుతీరావు, ఆయన భార్య ప్రపంచ ఆర్యవైశ్య సంఘంలో సభ్యులుగా ఉన్నారని టంగుటూరి రామకృష్ణ తెలిపారు. అయినప్పటికీ తాము మిర్యాలగూడ ఘటనపై మారుతీరావుకు మద్దతు ఇవ్వడం లేదని తేల్చిచెప్పారు. కొందరు కుల సంఘాల నాయకులు, రాజకీయ నేతలు మారుతీరావు నెపంతో తమ కులాన్ని లక్షంగా చేసుకుంటున్నారని వెల్లడించారు. దయచేసి ఏ కులాన్ని కూడా నిందించవద్దని విజ్ఞప్తి చేశారు.

దమ్ముంటే రెండు కుటుంబాలను కలపాలనీ, లేని పక్షంలో రాజకీయాలు చేయకుండా వెనక్కు తప్పుకోవాలని సూచించారు. ఆర్యవైశ్యులకు వ్యతిరేకంగా ఏ నేతలైనా స్టేట్ మెంట్ ఇస్తే తిరగబడతామనీ.. సదరు రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయాలని ప్రచారం చేస్తామని హెచ్చరించారు.

More Telugu News