currency: జనాలకు పెను భారంగా మారనున్న రూపాయి పతనం.. కారణాలు ఇవే!

  • పెట్రోల్, డీజిల్ ధరలకు పట్టపగ్గాలు ఉండవు
  • కీలకమైన వడ్డీ రేట్లు పెరుగుతాయి
  • విదేశాల్లో చదువుకునే విద్యార్థులపై మరింత ఆర్థిక భారం

అమెరికా డాలర్ మారకం విలువతో పోల్చితే మన రూపాయి నానాటికీ బలహీనపడుతోంది. డాలర్ తో పోల్చితే మన రూపాయి విలువ ఈరోజు రూ. 73.30కు పడిపోయింది. అమెరికన్ కరెన్సీకి పెరుగుతున్న డిమాండ్, అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న క్రూడాయిల్ ధరలే దీనికి ప్రధాన కారణం. ఈ పతనం ఇంతటితోనైనా ఆగుతుందా? లేక సెంచరీ కొడుతుందా? అనే ప్రశ్నకు ఆర్థిక నిపుణులు కూడా సరైన సమాధానం చెప్పలేక పోతున్నారు. ఒక వేళ రూపాయి పతనం ఇలాగే కొనసాగితే సగటు భారతీయుడు ఏమేరకు ప్రభావితం కాబోతున్నాడో తెలుసుకుందాం.

రూపాయి పతనమనేది మనకు ఎంత చేదు వార్తో... ఈ ఐదు కారణాలు చెప్పేస్తాయి!

రూపాయి విలువ పతనమైతే దేశీయ ఇంధన కంపెనీలపై దాని ప్రభావం తీవ్ర స్థాయిలో పడుతుంది. ఈ భారాన్నంతా ఆయిల్ కంపెనీలు వినియోగదారులపైనే వేస్తాయి. దీంతో, పెట్రోల్, డీజిల్ ధరలు పట్టపగ్గాలు లేకుండా పెరిగిపోతాయి. ఇంధన ధరలు పెరిగితే... రవాణా ఖర్చు పెరుగుతుంది. దీంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతాయి. ఫలితంగా ద్రవ్యోల్బణం పెరుగుతుంది.

రూపాయి విలువ పతనమైతే... దిగుమతులపై ప్రభావం పడుతుంది. దీంతో, ఇంపోర్ట్స్ బిల్లు ప్రభావితమై... కరెంట్ అకౌంట్ డెఫిసిట్ (సీఏడీ) పెరిగిపోతుంది. దిగుమతుల వ్యాపారం చేసేవారికి రూపాయి పతనం భారంగా పరిణమిస్తుంది. ఈ నేపథ్యంలో, దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు పెరుగుతాయి.

బలహీన పడుతున్న రూపాయి ప్రభావం ఆర్బీఐ పాలసీపై కూడా పడుతుంది. దీంతో, కీలకమైన వడ్డీ రేట్లను ఆర్బీఐ పెంచే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే మనం తీసుకునే లోన్లపై వడ్డీ రేట్లు పెరుగుతాయి. మనం కట్టే ఈఎంఐలు మరింత పెరుగుతాయి.

రూపాయి పతనం స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసేవారు తీవ్ర ఒత్తిడికి గురవుతారు. ఫలితంగా స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి పెరుగుతుంది. దీంతో, మార్కెట్లు పతనమయ్యే అవకాశం ఉంటుంది.

విదేశాల్లో చదువుకునే విద్యార్థులపై కూడా ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మన రూపాయి విలువ పతనమైతే విదేశాల్లో చదువుకునే వారి ఖర్చులు అమాంతం పెరుగుతాయి. మారకం విలువ పడిపోవడంతో యూనివర్శిటీ/కాలేజ్ ఫీజులు, తిండి, దుస్తులు, రోజువారీ ఖర్చులు ఇలా అన్నీ భారంగా మారతాయి. దీంతో, విద్యార్థులపై ఆర్థిక భారం మరింత పెరుగుతుంది.

రూపాయి పతనం మనపై ఏ రేంజ్ లో ప్రభావాన్ని చూపుతుందనేదానికి... ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.  

More Telugu News